Sep 20,2023 22:44

డెయిరీ కార్మికుల బిక్షాటన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
తమ పాత బకాయిలు చెల్లించాలని కోరుతూ స్థానిక రెడ్డిగుంట అమూల్‌ డెయిరీ ఎదుట విజయ డెయిరీ కార్మికులు చేపట్టి రిలే దీక్షలు బుధవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కార్మికులు భిక్షాటలను పూనుకోవడంతో పాటు అమూల్‌ డెయిరీ ఉద్యోగులను లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేంత వరకు పనులను అడ్డుకుంటామని విజయ డెయిరీ కార్మికుల యూనియన్‌ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమూల్‌ ఉద్యోగులను అడ్డుకున్నారనే విషయం తెలియగానే సహకార సంస్థ జిల్లా కార్యదర్శి వనజ, చిత్తూరు తహశీల్దార్‌ మురళీ మోహన్‌, టూ టౌన్‌ సిఐ అమూల్‌ డెయిరీ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌తో చర్చలకు నాయకులను తీసుకుపోతామని హామీ ఇవ్వడంతో తమ బకాయి జీతాలు చెల్లించేంత వరకు రిలేదీక్షలు కొనసాగుతాయని కార్మిక సంఘం నాయకులు తెలిపారు.