ప్రజాశక్తి-అనంతపురం డెంగీ వ్యాధ నివారణ ప్రతి ఒక్కరి బాధత్య అని డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ యుగంధర్ పిలుపునిచ్చారు. డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంవగా గురువారం నగరంలో మహార్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ తెలుగు తల్లి విగ్రహం వరకూ సాగి తిరిగి పెద్దాసుపత్రికి చేరుకుంది. అక్కడ మానవహారంగా ఏర్పడి డెంగీ నివారణకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధి ప్రాణాంతకమన్నారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరి చేరదన్నారు. ముఖ్యంగా దోమలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ఇందులో భాగంగా ఇంట్లో నీరు నిలువ ఉంచుకునే ట్యాంకులు, నీటి తెట్టెలు, డ్రమ్ములు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, డాక్టర్ మనోజ్‌కుమార్, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, మాస్ మీడియా అధికారి ఉమాపతి, డెప్యూటీ డెమో త్యాగరాజు, గంగాధర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ మారుతీప్రసాద్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, గిరిధర్ రెడ్డి, నూర్‌బాషా, శ్రీధర్, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురంలో ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంఅండ్‌హెచ్‌ఒ యుగంధర్










