డెంగీ.. డెంగీ...!
నగరంలో 20కి పైగా కేసులు..
మురికివాడల్లో దోమల ఉధృతి
నివారణ చర్యలు చేపట్టిన నరగపాలక సంస్థ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
వర్షాలతో ఇళ్ల పరిసరాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలు, పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉంటోంది. మురికివాడల్లో దోమల ఉధృతి పెరుగోతంది. దోమల వృద్ధి నివారణ కోసం నగర పాలక సంస్థ అనేక డ్రైనేజీల శుభ్రం, ఫాగింగ్ వంటి చర్యలు చేపడుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. నగర పాలక సంస్థ పరిధిలో 60కి పైగా ప్రభుత్వం గుర్తించిన మురికివాడలున్నాయి. ఈప్రాంతాల్లో నివసించే ప్రజలకు దోమలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరో వైపు డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయి.
నగరంలోని పలు కాలనీల్లో డెంగీ కేసులు వెలుగు చూశాయి. ఈఏడాదిలో చిత్తూరు నగరంలో దాదాపు 20కి పైగా డెంగీ కేసులు వెలుగుచూశాయి. నగర కమిషనర్ ప్రత్యక్షంగా పలు కాలనీలను తనిఖీచేసి మురుగునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించారు. దోమలు వృద్ధిచెందే ప్రాంతాలుగా 18 మురుగునీటి నిల్వలను గుర్తించి పారిశుధ్య కార్మికుల ద్వారా బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు కొన్ని మురుగునీటి కుంటలను వెంటనే పూడ్చివేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ గుర్తుంచిన కాలనీల్లో ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల నివారణ కోసం పొగను వదులుతున్నారు. అయితే నగర పాలక సంస్థ ఎంత కృషి చేస్తున్నప్పటికీ దోమల ఉధృతి తగ్గడం లేదు. ఇండ్ల చుట్టు ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ఖాళీ స్థలాలను శుభ్రం చేసేలా ఆ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని స్థానికులు కొందరు కోరుతున్నారు.
మరో వైపు డెంగీ వ్యాధి భయపెడుతోంది. వార్డు వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నా వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు రోజుల తరబడి అలానే ఉండిపోతున్నాయి. ఫలితంగా దోమల వృద్ధి పెరుగుతోంది. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర పాలకసంస్థ హెచ్చరిస్తోంది.
డెంగీ లక్షణాలు..
అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, దద్దుర్లు, నిరంతరం వాంతులు, కనుగుడ్ల నొప్పి, కండరాల నొప్పి, వాంతులు వచ్చిన్నట్లు అనిపించడం వంటివి డెంగీ వ్యాధి సొకినవారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. ప్రస్తుతం డెంగీ జ్వరం వచ్చిన మొదటిరోజు నుంచి వ్యాధి నిర్ధారణ చేసుకొనే అవకాశముంది. డెంగీ ఎన్‌ఎస్-1, ఐజిఎం అండ్ ఐజిజి వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యదులను సంప్రదించాలి.
దోమల నివారణ కోసం
వాడిపడేసిన పాతటైర్లు, డబ్బాలు, కుండ పెంకులు బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు. ఎయిర్ కూలర్లు, నీటితొట్టెలను వారానికోసారి శుభ్రం చేసుకోవాలి, ఇంటి, తలుపులకు దొమల నివారణ కోసం మెస్‌లు బిగించుకోవాలి, పిల్లలు పగటిపూట నిద్రిస్తున్న సమయంలో దోమతెరను ఉపయోగించాలి.
ప్రజల్లో అవగాహన పెరగాలి..
- డాక్టర్ అరుణ, నగర కమిషనర్
డెంగీ వ్యాధి నివారణ కోసం నగర పాలక సంస్థ అనేక చర్యలు చేపడుతోంది. రోజూవారి చెత్తసేకరణ, డ్రైనేజీలు శభ్రం చేస్తున్నాం. ముఖ్యంగా నగరంలోని కొన్ని ప్రాంతాలు దోమల వృద్ధికి నిలయాలుగా గుర్తించి శుభ్రం చేయించడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చు. పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. ఇది మంచి నీటిలో పెరుగుతుంది.










