Mar 06,2022 23:17

ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి
ప్రజాశక్తి- నగరి:
ఈ నెల 28, 29న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతువ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న 21వ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. లేబర్‌ కోడ్‌ పేరిట ప్రాణ త్యాగాలతో సాధించుకున్న టువంటి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ప్రజానాడి వ్యవస్థ అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆధాని వంటి బడాబాబులకు దారాదత్తం చేసే ప్రక్రియను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యా విధానం వల్ల మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే కుట్రలు చేస్తున్నారని, 32 మంది తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే దుర్మార్గపు చర్యను వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మిడ్‌ డే మిల్స్‌ కార్యకర్తలు వంటివారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కనీస వేతనంగా కేరళ ప్రభుత్వం ఇస్తున్న 18,000 వేల రూపాయలును నెల జీతంగా ప్రకటించాలన్నారు. స్కీమ్‌ వర్కర్‌గా ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, నూతన వ్యవసాయ చట్టాల పేరిట రైతుల నడ్డివిరిచే దుర్మార్గపు ప్రక్రియను భవిష్యత్తులో అమలు చేయకూడదని, ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి రైల్వే, పోస్టల్‌, ఎల్‌ఐసి, ఎయిర్‌పోర్ట్‌ వంటి సంస్థలను చౌకబారుగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడాన్ని మానుకోవాలన్నారు. కరోనా కష్టకాలంలో సామాన్యుల ఆర్థిక పరిస్థితి అట్టడుగు స్థాయికి చేరుకున్నాయన్నారు. ఇలా పలు డిమాండ్లతో 21వ దేశవ్యాప్త సమ్మెకు నగరి ప్రజలు భారి సంఖ్యలో తరలివచ్చి సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అలాగే 29వ తారీఖున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు జరగబోయే నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్‌, సంబంధం, పెరుమాళ్‌, జగదీష్‌, దనకోటియమ్మ, పాంచవర్ణం, శక్తివేలు, తంగరాజు, మైలు స్వామి తదితరులు పాల్గొన్నారు.