గుంతకల్లు : నరేంద్ర మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని సిపిఎం, సిపిఐ నాయకులు తెలియజేశారు. దేశానికి నష్టదాయకంగా మారిన కేంద్రంలోని బిజెపి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి చేపట్టిన ప్రచారభేరీ కార్యక్రమంలో భాగంగా బుధవారం గుంతకల్లు పట్టణంలోని భీరప్ప కూడలి నుంచి మహాత్మా గాంధీ కూడలి వరకు ఎద్దుల బండ్లు, గుర్రాలపై వినూత్న రీతిలో నిరసన ర్యాలీ చేపట్టారు. 'మోడీ హటావో.. దేశ్‌కి బచావో'.. అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కూడలి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులు ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో అన్ని విధాలుగా దేశాన్ని అథోగతిపాలుజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్య కుల, మతం, ప్రాంతాల చిచ్చుపెట్టి మత ఘర్షణలను రేపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటనలో ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం చూస్తుంటే బిజెపి మతతత్వ విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బిజెపిని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. ఇక రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగిస్తున్న సిఎం జగన్ రెడ్డి మోడీ మోచేతి నీళ్లను తాగుతూ రాష్ట్ర ప్రయోజనాలు మోడీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఓ ఒక్క అధికార పార్టీ ప్రజా ప్రతినిధి రైతులను పరామర్శించక పోవడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మోడీ సర్కారును నిలదీసే దమ్ము ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఓ.నల్లప్ప, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదష్, జిల్లా కార్యదర్శి జాఫర్, నియోజక వర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఎం జిల్లా నాయకులు డి.శ్రీనివాసులు, సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శులు బి.శ్రీనివాసులు, గోపినాథ్, సిపిఎం పట్టణ నాయకులు దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్, కసాపురం రమేష్, జగ్గలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.










