Aug 14,2023 21:06

గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

         ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌    అసమానతలు, హింస, దోపిడీ, దాడులు లేని సమాజాన్ని నిర్మించుకోవడంతోపాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మతోన్మాదాన్ని తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి పిలుపునిచ్చారు. సోమవారం 'సేవ్‌ ఇండియా' నినాదంతో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని రైల్వేస్టేషన్‌ నుంచి 77 అడుగుల జాతీయ పతాకంతో టవర్‌క్లాక్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తిరిగి టవర్‌క్లాక్‌ మీదుగా రైల్వేస్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌ మాట్లాడుతూ 200 ఏళ్ల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ ఎందరో అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆనాడు భారతీయులకు బానిసత్వాన్ని ప్రయోగించి తెల్లదొరలు సాగించిన నరమేధం ఇప్పటికీ మరచిపోలేమన్నారు. కూడు, గూడు, గుడ్డ కోసం, దేశ వనరులు దేశంలోని ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని జరిగిన మహోధ్యమం మన భారత దేశ స్వాతంత్రోద్యమం అన్నారు. ఈ స్వాతంత్య్ర ఉద్యమంలో కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ఏకతాటిపై నడిచి తెల్లదొరలతో పోరాడారని తెలిపారు. ఈ స్వాతంత్ర పోరాటంలో భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవకారులు ప్రాణాలు అర్పించారన్నారు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి దేశవ్యాప్త ఉద్యమాలను కొనసాగించి కులాల మతాలకతీతంగా ప్రజలను చైతన్య పరిచారన్నారు. నాడు దేశ సంపద అంతా బ్రిటిష్‌ వారు ఇంగ్లాండ్‌కు తరలించారని, వ్యాపారం పేరుతో, పన్నుల పేరుతో భారతీయులను హింసించారన్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనల అనంతరం ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అయితే దాదాపు 75 సంవత్సరాల తర్వాత బ్రిటిష్‌ పాలను తలపించేలా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పాలన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారం చేపట్టిన తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, మత విధ్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న మారణహోమం అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు నిదర్శనమన్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్న దేశ ప్రధాని స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు. దేశం మొత్తం దిగ్భ్రాంతి కలిగేలా జరిగిన మహిళల నగ ప్రదర్శన బిజెపి ప్రభుత్వ అసమర్థతకు అద్దపడుతోందన్నారు. నాటి బ్రిటిష్‌ పాలనలో జరిగిన దేశ సంపద లూటీని నేటి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దేశంలోని ప్రజలు ఆకలికేకలతో అల్లాడుతుంటే దేశ సంపదను కార్పొరేట్లకు అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, ఎల్‌ఐసిలను కూడా ప్రయివేటీకరణ చేస్తున్నారని తెలిపారు. ఈనేపథ్యంలో బిజెపి ప్రభుత్వానికి జాతీయ జెండాను ఎగుర వేసే నైతిక హక్కు లేదన్నారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విద్యార్థులను చైతన్య పరుస్తున్న సేవ్‌ ఇండియా సేవ్‌ డెమోక్రసీ పేరుతో తిరంగా ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కమిటీ సభ్యురాలు రజిత, జిల్లా సహాయ కార్యదర్శి తరిమెల గిరి, సూర్య ప్రకాష్‌, నాయకులు శివ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ, విద్యార్థులు, మేథావులు, తదితరులు పాల్గొన్నారు.