Mar 25,2023 22:20

మెగా చెక్కును అందిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి ఎ.వెంకటశేష సాయి

        రాయదుర్గం రూరల్‌ : దేశ ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో కీలకం అని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి పేర్కొన్నారు. రాయదుర్గం మండల పరిధిలోని 74 ఉడేగోళం మద్ధాన్నేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శనివారం ఉదయం మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్జు జడ్జి వెంకటశేషసాయి హాజరై ప్రసంగించారు. హక్కుల గురించి మహిళలు తెలుసుకోవాలన్నారు. మహిళా సాధికారిత అంటే కుటుంబ, దేశ సాధికారత అని అర్థం అన్నారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. జిల్లాలో బసివినుల వ్యవస్థను రూపుమాపి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చేస్తున్న కషిని అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి డి.రమేష్‌ మాట్లాడుతూ బాలికలపై అత్యాచారయత్నం జరిగిన ఘటనలకు సంబంధించి 80 శాతం పోలీసుల దష్టికి రావడం లేదన్నారు. పిల్లలకు మంచి, చెడులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజేయాలన్నారు. జస్టిస్‌ శ్యాంసుందర్‌ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్పీ డా||ఫక్కీరప్ప మాట్లాడుతూ జిల్లాలో వెల్ఫేర్‌ శాఖ సహకారంతో పరిశీలన చేయగా జిల్లాలో వేలమంది జోగిను, మాతంగి, బసివినులు దీన స్థితిలో ఉన్నట్లు తేలిందని జిల్లా ఎస్పీ పకీరప్ప చెప్పారు. 2022 సంవత్సరంలో అనంతపురంలోని ఎస్‌ఆర్‌ఐటి కళాశాలలో మెగా క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించమన్నారు. అనంతరం ఆర్‌డిటి సంస్థ సహకారంతో 39 మంది బసివినిలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు మంజూరైన రూ.1.17 కోట్ల మెగా చెక్కును హైకోర్టు జడ్జి బిసివినులకు అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బబిత, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్‌ రెడ్డి, తహశీల్దార్‌ మారుతి, న్యాయవాదులు ఆర్‌టి.జగన్మోహన్‌ రెడ్డి, అబ్దుల్‌ వహాబ్‌ రెహ్మాన్‌, తదితరులు పాల్గొన్నారు.