Feb 27,2023 20:54

ఎపి నిట్‌లో ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
దేశ ప్రగతికి సైన్స్‌ పరిశోధనలు ఎంతో కీలకమని, ప్రాథమిక అంశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని ఎపి నిట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌ రెడ్డి విద్యార్థులకు సూచించారు. నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రమోద్‌ పడోలే ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీన్‌ అకడమిక్‌ డాక్టర్‌ టి.కురుమయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి దినేష్‌ శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారత రత్నతోపాటు భౌతిక శాస్త్రంలో ఎన్నో అపార సేవలందించి భారత్‌ తరపున మొట్టమొదటి నోబెల్‌ బహుమతిని అందుకుని సివి రామన్‌ భారత్‌ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. సివి రామన్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని నవ చైతన్యానికి నాంది పలకాలని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలతోపాటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత యువతరానిదేనని వివరించారు. గౌరవ అథితి ఐఐటి భువనేశ్వర్‌ స్కూల్‌ ఆఫ్‌ బేసిక్‌ బిజినెస్‌ విభాగం ఆచార్యులు విఆర్‌ పెద్దిరెడ్డి మాట్లాడుతూ పరిశోధనలు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి చేరినపుడే వాటికి సార్థకత లభిస్తుందన్నారు. డీన్‌లు జిఆర్‌కె.శాస్త్రి, జిబి వీరేష్‌ కుమార్‌, ఎన్‌.జయరామ్‌ మాట్లాడారు. అనంతరం విద్యార్థులు పరిశోధనలను ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.