Sep 21,2022 21:18

దేశ భవిష్యత్తు విద్యార్థుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంది: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
దేశ భవిష్యత్తు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, వీరి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ పేర్కొన్నారు. బుధవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పిసిఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డీవార్మింగ్‌ మాత్రలను ఉచితంగా అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని వారి ఆరోగ్య సంరక్షణకు ఇమ్యూనైజేషన్‌, ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. నులిపురుగులు సోకిన పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం లాంటి ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయని దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా డీవార్మింగ్‌ మాత్రలు అందజేయడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేసన్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ కిషోర బాలులు, విద్యార్థులలో నులిపురుగులు సోకడం వలన కడుపునొప్పి, నీరసం, ఆందోళన, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. దీనిని నిర్మూలించేందుకు 400 మీ.గ్రాల ఆల్బెండజోల్‌ మాత్రలు అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలలో ఉచితంగా ఇవ్వబడతాయని, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణను దష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు పిల్లలచే ఈ మాత్రలను చప్పరించడం కానీ, నమిలించడం కానీ చేయాలని కోరారు. డీఈఓ పురుషోత్తం మాట్లాడుతూ రక్తహీనతను నివారించేందుకు విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీవార్మింగ్‌ మాత్రలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్‌డిహెచ్‌కె కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుదర్శన్‌, ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ వాణి, పిసిఆర్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనాక్షి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.