పెరుగులంక భూముల్లో అక్రమ తవ్వకాలను ఆపాలని డిమాండ్
కెవిపిఎస్, వ్యకాస ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
అడ్డుకున్న పోలీసులు : ఇరువురి మధ్య వాగ్వివాదం
కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన బాధితులు
ప్రజాశక్తి - భీమవరం
యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితులకు చెందిన లంక భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలను ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ హెచ్చరించారు. లంక భూముల్లో అక్రమ తవ్వకాలను ఆపాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వందలాది మంది బాధితులు ఆటోల్లో, మోటార్ సైకిళ్ల పై చించినాడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. మాగొడు వినండి, మా భూములు కాపాడండి అంటూ చేసిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదని లంక భూముల బాధితులను, నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఉధృత పరిస్థితులకు దారి తీసింది. నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులు, బాధితులు నేతలు భూముల తవ్వకాలను తక్షణం ఆపాలని, యలమంచిలి తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ఇలా ఉండగానే బాధితులతో కలిసి కలెక్టరేట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బాధితలకు మధ్య మరోమారు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జెక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ పేదలు సాగుచేసుకొనే భూములను అక్రమంగా తవ్వడం దారుణమన్నారు. హైకోర్టు ఇచ్చిన జిఒలు తుంగలో తొక్కి అధికారులు అక్రమంగా తవ్వకాలు చేపట్టడం అన్యాయమన్నారు. భూస్వాముల భూములు వదిలి కేవలం దళితులు, బిసిలు, నిరుపేదల భూములను మాత్రమే తవ్వడమేంటని ప్రశ్నించారు. పెరుగులంక భూములు తవ్వితే వరద ముంపునకు గురయ్యేది దళితుల భూములేనని అన్నారు. పేదల భూముల్లో వ్యవసాయం కూడా చేసుకొనివ్వడం లేదన్నారు. తహశీల్దార్ అవినీతి అధికారిగా మారి పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ చించినాడలో దళిత పేద కుటుంబాలకు చెందిన లంక భూముల్లో అధికారులు అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్‌సి, బిసి కుటుంబాలకు చెందిన 60 ఎకరాల భూములకు 1983లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఆ భూముల్లో వాణిజ్య పంటలు సాగు చేసుకొనేవారన్నారు. ఆక్వా వల్ల సర్వే చెట్లు కూడా పండేవి కాదన్నారు. కోవిడ్ అనంతరం ఆక్వా చెరువుల ప్రభావం వల్ల ఉమ్మడిగా ఆక్వా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గోదావరి వల్ల పెరుగు భూమి 10 ఎకరాలు పెరిగిందని చెప్పారు. ఈ భూమి పేద దళిత కుటుంబాలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అక్కడ భూస్వాములు, అధికారులు అక్రమంగా ఆ 10 ఎకరాల భూమిలో మట్టి తవ్వి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహశీల్దార్ ప్రధాన పావుగా వ్యవహరిస్తున్నారని విమిర్శంచాఉ. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని హైకోర్టులో కేసు వేస్తే స్పందించిన న్యాయస్థానం మట్టి తవ్వకాలను ఆపాలని ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. అయినా హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు పోలీసు పహారా పెట్టి అక్రమంగా మట్టి తవ్వకాలను చేపడుతున్నారని విమ్శించారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ దళితుల భూముల్లో అధికారులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. తక్షణం అధికారులు ఆలోచనను విరమించుకోవాలన్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేసి పోలీసుల పహారాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణం అక్రమ తవ్వకాలను ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు లాక్కోవాలని చూడడం దారుణమన్నారు. లంక భూముల పరిరక్షణ పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. అనంతరం 15 మంది ధర్నా బృందం సభ్యులను పోలీసులు కలెక్టరేట్‌లోకి అనుమతించడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. జెసితో పాటు లంక భూముల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి, జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల విజయకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కానేటి బాలరాజు, చించినాడ గ్రామస్తులు గొల్ల ఏడుకొండలు, స్టాలిన్, నాగరాజు, జయప్రభ, పాల్గొన్నారు.










