May 22,2022 22:48

గురువులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి- కార్వేటినగరం: ఎన్నాళ్ళు అయింది మిత్రమా... నిన్ను చూసి అంటూ ఒకరు, అబ్బా భలే చేసేవాడు కదా మిత్రమా అంటూ మరొకరు, వీడి కామెంట్‌తో అంత లేదంటూ ఇంకొకరు, ఇలా మిత్రుల ఆనందంతో ఎవరికి వారు నాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఆదివారం కార్వేటినగరం జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌ )లో 2005-2007 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఏళ్లనాటి మిత్రులు అందరూ ఒకచోట చేరడంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎక్కడ ఏం చేస్తున్నావు ఒక ఫోన్‌ చేస్తే నీ సొమ్మేం పోయిందని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల నుంచి తరలివచ్చిన మిత్రులను పలకరించి కొన్ని మాట్లాడుకున్నారు. ఎన్నాళ్లుగానో అందరూ కలుసుకోవాలనే కోరిక తీరడంతో నాటి తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ గడిపారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన లోకనాథం మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శేఖర్‌ మాట్లాడుతూ గురువులకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎస్సీసీఇఆర్టీ ప్రొఫెసర్‌ బ్రహ్మయ్య, విశ్రాంతి అధ్యాపకులు జయరాం, సుందరయ్య, డా ''కోటేశ్వర్‌, యోగనందం నాయుడు, ప్రతాప్‌, విజయ కుమారి, దేశసేన, 2005-2007 సం '' బ్యాచ్‌ మిత్రులు అందరూ కలిసి గురువును ఘనంగా మెమోంట్‌లు ఇచ్చి సన్మానించారు.