Oct 24,2023 21:41

శిలగాం నుంచి కవిటి వచ్చే రోడ్డు పక్కనే గోడ కట్టినట్టు పెరిగిన మొక్కలు

* జరగని జంగిల్‌ క్లియరెన్స్‌
* ప్రమాదకరంగా మలుపులు
* ప్రయాణికులకు అవస్థలు
ప్రజాశక్తి - కవిటి: 
కవిటి మండలంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తిగా చేపట్టకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయి రహదారులు మూసుకుపోతున్నాయి. చాలా గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఇవి పేరుకుపోయి మలుపుల వద్ద ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శిలగాం గ్రామం నుంచి కవిటి వచ్చే రహదారి, బిజిపుట్టుగ నుంచి సహలాలపుట్టుగ వెళ్ళే రహదారి, కొజ్జిరి నుంచి రాజపురం మీదుగా కవిటి వచ్చే మార్గం, ప్రగడపుట్టుగ నుంచి కపాసుకుద్ది, నెలవంక వెళ్ళే రహదారి, కవిటి నుంచి ఈదుపురం వెళ్ళే రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోయి రోడ్డు పైకే వచ్చేస్తున్నాయి. దీంతో మలుపుల వద్ద, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నామని, ఈ రహదారుల్లో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పిల్లలు సైకిల్‌పై పాఠశాలలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు తమ దృష్టంతా అటువైపే ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాహన చోదకులు, విద్యార్థులు, ప్రజల సౌలభ్యం కోసం వెంటనే జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలని కోరుతున్నారు.