అనంతపురం కలెక్టరేట్ : వందేళ్ల కిందటే బడుగుల హక్కులతో పాటూ స్త్రీ సమానత్వానికి బాటలు వేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లోని జెడ్పీ కార్యాలయంలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫూలే విగ్రహానికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజిమ్మ, కలెక్టర్ ఎమ్.గౌతమి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జెడ్పీ సమావేశ మందిరంలో పాఠశాల విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ విద్యతోనే మానవాలి ప్రగతి సాధ్యమని నమ్మిన వ్యక్తి ఫూలే అన్నారు. మహిళలను అబలలుగా చూసే రోజుల్లో తన భార్య సావిత్రిబాయికి సొంతంగా చదువు చెప్పారన్నారు. ఆయన జీవితం ఆ తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహితీ, కోగటం విజయ భాస్కర్ రెడ్డి, ఆహుడా ఛైర్‌పర్సన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, రజక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్ ఛైర్‌పర్సన్ మంజుల, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్ హరిత, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి, జిల్లా బీసీ సాధికార, సంక్షేమ అధికారి ఖుష్బు కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముని, జెడ్పీ సీఈవో భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.










