Aug 04,2022 21:50

దారి దోపిడి కేసులో యువత అరెస్టు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :
మారిన కల్చర్‌కు తగ్గట్టు యువత అలవాట్లలో పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బార్లు, పబ్‌ కల్చర్‌ నగరాల్లో యువతపై తీవ్రప్రభావం చూపుతోంది. జల్సాల కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భావిభవిష్యత్‌ పౌరులుగా ఎదగాల్సిన యువత ఉన్నత విద్యచదివినా విలాసాల కోసం పెడదారి పడుతున్నారు. ఈక్రమంలో జల్సాలకు అలవాటుపడి దారిదోపిడీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలు పాలైన యువత సంఘటన చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లి సులేమాన్‌ స్టీట్‌కు చెందిన భరత్‌ (19) చెన్నై నగరంలోని ఓఇంజనీరింగ్‌ కళాశాల్లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఇంట్లో చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులతో పాటు జల్సాలకు అలవాటుపడిన భరత్‌ చిత్తూరులో తనతో పాటు చదువుకున్న స్కూల్‌మెంట్స్‌, కాలేజీ స్నేహితులతో ఓ ముఠాను తయారు చేశాడు. అవసరాల కోసం పథకం ప్రకారం స్నేహితుల సాయంతో సినీపక్కీలో దోపిడీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 13ఏళ్ల వయసులో కడప జిల్లాలో ఓ వ్యాపారిని బెదిరించి దోపిడి చేసినట్లు పోలీసుల విచారణలో భరత్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. జీడినెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న దారిదోపిడి కేసులో పట్టుబడ్డ ఎనిమింది నిందితులు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లికి చెందిన ఉన్నతవిద్య చదువుతున్న విద్యార్థులే. వీరిలో కొందరు పివికెఎన్‌, సీతమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులు కాగా ఈ కేసులు ప్రధాన ముద్దాయి భరత్‌ చెన్నై నగరంలో బిటెక్‌ చదువుతున్నాడు. దారిదోపిడీ కేసులో ఒక్కసారిగా ఎనిమిది మంది యువత పట్టుబడగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.
నేరం ఇలా...
భరత్‌ చెన్నైలో చదువుతున్నా చిత్తూరులో వాహనాలు అద్దెకు ఇచ్చేవాడు. ఈక్రమంలో ఈనెల 1వ తేదీ కెసిసి కన్ట్స్రక్షన్‌ కంపెనీ పిఆర్‌ఓ జాన్సన్‌ మారుతి షిప్టు వాహనాన్న అద్దెకు తీసుకొని రూ.12లక్షలో చెన్నై నగరానికి బయలుదేరాడు. కారు డ్రైవర్‌ విక్రమ్‌, భరత్‌ స్నేహితుడు కావడంతో కారు ఎక్కడి నుండీ ఎక్కడికి పోతోందనే సమాచారం భరత్‌కు అదించాడు. భరత్‌ స్నేహితులతో కాన్ఫెరెన్స్‌ కాల్‌ చేసి దోపిడికి ప్లాన్‌చేశాడు. భరత్‌తో పాటు మరో ఎనిమిది మంది స్నేహితులు కలసి చిత్తూరు- తచ్చూరు ఆరు లైన్స్‌ హైవే కాలేపల్లి క్రాస్‌వద్ద కెసిసి కన్ట్రక్షన్‌ పిఆర్‌ఓ జాన్సస్‌ ప్రయాణిస్తున్న కారును అటకాయించి కర్రలు, ఇనుప రాడ్లతో బెదిరించి రూ.12 లక్షల నగదు దోచుకున్నారు.
కేసును చేధించిన పోలీసులు..
ఈనెల1వ తేదీ జీడినెల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న కేసును మూడు రోజుల వ్యధిలో పోలీసులు చేధించారు. దోపిడి చేసిన సోమ్మును పంచుకొనేందుకు భరత్‌ ముఠాలోని సభ్యులు చిత్తూరు- బెంగుళూరు బైపాస్‌రోడ్డు చెర్లోపల్లి వద్ద సమావేశమయ్యారు. కొందరు యువకులు ఘర్షణ పడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి చేరుకున్న పోలీసులు వారి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో జీడినెల్లూరు దోపిడికి పాల్పడింది తామేనని, అలాగే మరికొన్ని నేరాలు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. ఈదోపిడి కేసులో భరత్‌కు స్నేహితులతో పాటు తల్లి తేజశ్రీ కూడా పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులంతా స్థానికులే...
దారి దోపిడి కేసులో పట్టుబడ్డ నిందితులు అందరూ నగరంలో కొంగారెడ్డి పల్లికి చెందిన వారే.. ప్రధమ ముద్దాయి భరత్‌ (19) తేజశ్రీ (భరత్‌ తల్లి) పవన్‌కుమార్‌, కృష్ణ కొంగారెడ్డిపల్లి, లవకుమార్‌, చరణ్‌రాజ్‌ యాదమరి, పవన్‌కుమార్‌ తవణంపల్లి, సందీప్‌ తోటపాళ్యం, విక్రమ్‌ కారు డ్రైవర్‌ పెనుమూరు. వీరితో పాటు దారిదోపిడి కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంగారెడ్డిపల్లికి చెందిన రూపేష్‌, సాయి, పరందామ నాయుడు (భరత్‌ తండ్రి) ధనరాజ్‌లు పరారీలో ఉన్నారు.
తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఓ కంట కనిపెట్టాలి..
తల్లిదండ్రులు ఇంట్లో వయసుకొచ్చిన పిల్లలు ఎక్కడి వెళ్ళుత్తున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలపై అప్రమత్తంగా ఉంటూ ఓ కంట కనిపెడుతుండాలి. ముఖ్యంగా స్నేహితులతో కలిసి ఎలాంటి పనులు చేస్తున్నారానే విషయాలను తెలుసుకోవాలి. చెడు అలవాట్లు, పెడదారి పడుతున్నట్లు గుర్తిస్తే మంచి మాటలు చెప్పి సన్మార్గంలో పెట్టుందుకు ప్రయత్నించాలని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి సూచించారు. జిల్లాలో దారిదోపిడి కేసులో 12మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అదుపలోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమాల ప్రభావం, జల్సాలకు అలవాటు పడ్డ యువత డబ్బుకోసం ఎలాంటి చర్యలకు పాల్పడుతూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.