Sep 14,2022 22:53

రూ.80లక్షలతో జిల్లాలో మొట్టమొదటి
డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం
ప్రజాశక్తి - నగరి:
నగరి మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్‌ వైయస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కే.రోజా బుధవారం ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేటలో రూ.80లక్షలతో నిర్మించిన జిల్లాలోనే మొట్టమొదటగా డాక్టర్‌ వైయస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌.హరి నారాయణన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే జగన్మోహన్‌ రెడ్డి ఎవరూ చేయనటువంటి సంస్కరణలను వైద్యశాఖలో తీసుకువచ్చారని తెలిపారు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండల కేంద్రంలో అత్యాధునిక అత్యవసర సదుపాయాలతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొద్ది రోజులక్రితమే ప్రారంభించారని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత కోవిడ్‌ టైంలో కానీ ఇప్పుడు కానీ, అప్పులపాలు కాకుండా పేదప్రజలను కాపాడిన విషయం తెలిసిందే అని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉచిత కోవిడ్‌ వైద్యపరీక్షలు, వాక్సిన్‌లను అందజేశారని తెలిపారు. అలాగే కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజారోగ్యంపై పూర్తి శ్రద్ధ చూపారని, అంతే కాకుండా కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించారని తెలిపారు.
అలాగే ప్రతి మండలానికి కూడా రెండు ప్రాథమిక వైద్య కేంద్రాలను మంజూరు చేశారని, తదనుగునంగా ఇప్పుడు 176 కొత్త పిహెచ్సిలను మంజూరు చేశారని తెలిపారు. గతంలో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రులను కానీ ప్రభుత్వ బడులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్న విషయం అందరికి తెలిసిందే అని తెలిపారు. నేడు నాడు-నేడు కార్యక్రమం ద్వారా చాలా అధ్బుతంగా ఆసుపత్రులను, పాఠశాలను పునర్నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి, జిల్లా ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్లు మున్సిపల్‌ కమిషనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, కోఆప్షన్‌ నెంబర్లు పాల్గొన్నారు.