May 03,2023 09:04

దాచూరి రామిరెడ్డికి నివాళులు అర్పిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

           అనంతపురం కలెక్టరేట్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై దాచూరి రామిరెడ్డి పోరాటం నేటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తాయని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి కోటేశ్వరప్ప తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యుటిఎఫ్‌) ఆధ్వర్యంలో దాచూరి రామిరెడ్డి ఏడవ వర్ధంతి సభను అనంతపురం జిల్లా యుటిఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లింగమయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోటేశ్వరప్ప ప్రసంగించారు. ఉపాధ్యాయులు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసిన మహనీయుడు దాచూరి రామిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమాన్ని రాష్ట్రంలోనే కాకుండా కలిసివచ్చే ఇతర రాష్ట్రాలల్లోనూ నిర్మించారని చెప్పారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గోవిందరాజులు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి ఉపాధ్యాయ వత్తితో పాటు వైద్యవత్తి కూడా నేర్చుకుని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. ఎటువంటి క్లిష్ట సమయంలో అయినా పోరాటాలను చేసి ఫలితాలను తీసుకొచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈనాడు ఉద్యమ సంఘంగా యుటిఎఫ్‌ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గోవిందరాజులు, అధ్యక్షులు రమణయ్య, సీనియర్‌ నాయకులు జిలాన్‌, గంగాధర, శేషప్ప, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.