Mar 03,2023 14:45

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పేద సామాన్యుల నడ్డివిరుస్తోన్న కేంద్రంలోని బి.జే.పి ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై రాష్ర్టంలోని ప్రజలంతా ఐఖ్యంగా పెద్దఎత్తున పోరాటం చేయాలని సి.పి.యం మండల కమిటీ సభ్యులు సిర్రా నర్సింహమూర్తి, పి.మోహనరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరలను నిరశిస్తూ సిపియం ఆధ్వర్యంలో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట, పెనుమంచిలి, వల్లూరు గ్రామాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సంతమార్కెట్ వీధి, రామేశ్వరస్వామి సత్రం మీదుగా ఆచంట కచేరీ సెంటర్ వరకూ గ్యాస్ బండలను నెత్తిన ధరించి భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. సెంటర్ లో జరిగిన సభకు మండల కమిటీ సభ్యులు యస్.వీ.యన్ శర్మ అధ్యక్షత వహించారు. సంధర్భంగా నర్సింహమూర్తి, మోహనరావులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50, వాణిజ్య సిలెండర్‌ రూ.350 పెంచడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 3 సంవత్సరాల క్రితం వరకు రూ.417 ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధర నేడు రూ.1155 రూపాయలకు పెరిగిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ జమను రెండు సంవత్సరాల నుండి నిలిపివేసిందన్నారు. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారని మండిపడ్డారు. ఒక ప్రక్క నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలంతా బెంబేలెత్తి పోతుంటే మరోప్రక్క నెల నెలకూ గ్యాస్ ధరలు పెంచేయడం మూలిగే నక్కపై తాటి పండు పడ్డ మాదిరిగా తయారైందని అన్నారు. రాష్ర్టంలోని వై.యస్.ఆర్, తెలుగుదేశం, జనసేన వంటి ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఏ మాత్రం మాట్లాడలేకపోవడం నిసిగ్గు చర్యగా అభివర్ణించారు. ప్రజంతా ఐఖ్యంగా  కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర  ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే దాకా ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో సిపియం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, ఇంజేటి వీరయ్య,సీనియర్ నాయకులు తోటపల్లి సత్యన్నారాయణ,ఇందుకూరి సూర్యనారాయణ రాజు, బొర్రా ధర్మారావు,సిర్రా విఘ్నేశ్వర్రావు, తమరాపు దుర్గాప్రసాద్,కేతా భవానీ శంకర్,మానుకొండ రాంబాబు, పిల్లి శ్రీరాములు, తాళం సుబ్బారావు, దాసరి తిరుపతిరావు, దాసరి కీర్తిశ్రీ, పార్శి సత్యవతి, మానుకొండ నర్సింహమూర్తి, పైడి సత్యన్నారాయణ, నిమ్మకాయల చందర్రావు, బొర్రా నాగేశ్వర్రావు తదితరులు