- సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాంభూపాల్
ప్రజాశక్తి-గుంతకల్లు : ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు వారి వారి అక్రమాలపై ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు చేసుకోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాం భూపాల్ మండిపడ్డారు. గుంతకల్లు పట్టణంలోని ప్రజా సమస్యలపై స్థానిక సిపిఎం నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం మూడవ రోజుకు చేరాయి. దీంతో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాంభూపాల్ వారి దీక్షలకు మద్దతు తెలిపారు.మూడవ రోజున సిపిఎం అనుబంధ ప్రజా సంఘం అయిన కెవిపిఎస్ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వి.రాంభూపాల్ మాట్లాడుతూ ప్రజలను ఓటు బ్యాంకు గానే చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వారి సమస్యలు పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బం దులు పడుతుంటే అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రధాన నేతలు వారి వారి అవినీతి, అక్రమాలపై, భూ కబ్జాలపై వ్యక్తిగత ఆరోపణలు,సవాళ్లు చేసుకోవడం కాకుండా దేవుళ్ళను కూడా వారి కుళ్ళు రాజకీయాల్లోకి ఈడ్చడం సిగ్గు చేటన్నారు. గత కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ఆదాయ వనరుగా మారాయన్నారు. ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మాణం చేసుకోలేని పేదల స్థలాలను వైకాపా నాయకులు దర్జాగా కబ్జాలు చేసి లక్షలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అందుకు ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా సాకుతో రెండేళ్లుగా శస్త్ర చికిత్సలు చేయకపోవడంతో గర్భవతులు కష్ట కాన్పులు ఉన్నపుడు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులు చేసి లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పట్టణ శివారు కాలనీలలో ప్రజలకు తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు, అధికా రులు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.జగనన్న లేఅవుట్ లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఐదు లక్షలు రుణం మంజూరు చేయాలన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అందుకే ప్రజా ధనంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గు చేటన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ బిజెపిపై తన వైఖరి మార్చుకోవాలని బిజెపిని రాష్ట్రంలోకి తెస్తే ప్రజల నెత్తిపై నిప్పుల కుంపటి పెట్టినట్లు అవుతుంద న్నారు. స్థానిక ప్రజా సమస్యలను అధికార, ప్రతిపక్ష పార్టీలు విష్మరిం చినా ఎర్రజెండా పార్టీ సిపిఎం విష్మరించదని అందుకే రిలే నిరాహారదీక్షలు చేపట్టిందన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధి, అధికారులు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని లేనిపక్షంలో రాయలసీమ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, పట్టణ కార్యవర్గ సభ్యులు కసాపురం రమేష్, మారుతి ప్రసాద్, జగ్గలి రమేష్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.










