ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : బిజెపి ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందామనే నినాదంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఆరోవ రోజు సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిష్టు పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ప్రచార భేరి యాత్ర కార్యక్రమం ప్రత్తిపాడు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారభేరి యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణలు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలకు అచ్చేదిన్ తీసుకువస్తానని ప్రచారం చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చేదిన్ తీసుకొచ్చిందని వారు విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధర కోసమే కాకుండా పంట అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సిన దుస్థితి బిజెపి ప్రభుత్వం హయంలో ఏర్పడిందని వారు అన్నారు. దేశాన్ని పాలించే అర్హత మోడీకి లేదని వారు విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కనీస పాత్రలేని వారు దేశాన్ని పాలించడం సిగ్గుచేటు అని వారన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను, అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్ ఇస్తామని నేడు నోరు మెదపడం లేదని వారు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా,రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. నిర్వాసితులను ఆదుకోలేదని మండిపడ్డారు.ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టి మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని వారి ఆవేదన వ్యక్తం చేశారు .పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యవసర వస్తువులు, ఎరువుల ధరలు, ప్రజల ఔషధాలు ధరలను పెంచి,జిఎస్టి తీసుకువచ్చి ప్రజల వస్త్రాల ధరలు, ఎలక్ట్రికల్ గూడ్స్ వస్తువుల ధరలు, అన్ని వస్తువులు, పిల్లలు రాసుకొనే పెన్నులు పై జీఎస్టీ భారాలు వేయడం దారుణం అన్నారు. ప్రచారభేరిలో ప్రత్తిపాడు గ్రామ ప్రజలంతా పాల్గొని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని,ఈదేశం నుండి బిజెపి ని, బిజెపి పార్టీతో జతకట్టిన పార్టీలను తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాసాని శ్రీను, అల్లంకి రాము, జవ్వాది శివ, శిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ,కోరాడ వెంకటేశ్వరరావు, ఉయ్యూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










