ప్రజాశక్తి-గుత్తి : పీఎం నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి బి. రామకృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు పేర్కొన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఈనెల 14 నుంచి 30 వరకు చేపట్టిన ప్రచారబేరికి సంబంధించిన వాల్ పోస్టర్లను వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం ఆర్అండ్బి అతిథి గృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు,పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని నిరసిస్తామన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వి.నిర్మల, నాయకులు రామచంద్ర రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్, కార్యదర్శి పద్మావతి, మండల కార్యదర్శి మహముదా, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, సిపిఐ నాయకులు రమేష్, రామకృష్ణ, షఫీ, రాజు తదితరులు పాల్గొన్నారు.










