May 08,2023 16:05
  • సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం 

ప్రజాశక్తి-భీమవరం : తడిచి, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం డిమాండ్ చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో  సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన, కురుస్తున్న అకాల భారీ వర్షాల వల ధాన్యం చాలా చోట్ల తడిచిపోవడం వల రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాలు ప్రకృతి విపత్తు అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో, సంచులు అందించడంలో, వాహనాలు సకాలంలో సమకూర్చకపోవడంలో, బరకాలు, టార్పాలిన్ లు ఇచ్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చాలా చోట్లా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకురాకపోవడం రైతాంగాన్ని తీవ్ర కలవరపెడుతుందన్నారు. నిబంధనలు సడలించి రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఒకవైపు మంత్రులు, జిల్లా అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్తున్నప్పటికీ ఆచరణలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. నూక శాతం ఎక్కువ ఉందనే పేరుతో రైతుల నుంచి కొనుగోలుదార్లు అడ్వాన్సు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. డబ్బులు చెల్లిస్తేనే కొనుగోళ్లు చేస్తామని తేల్చి చెబుతున్నారన్నారు.  ఒకవైపున ధాన్యం తడిచిపోయి, మాసూళ్లు కాక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొనుగోళ్ళకు ఇన్ని ఇబ్బందులు పెట్టడం గోరుచుట్టుపై రోకటి పోటులా ఉందన్నారు. దీని వల రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిబంధలను సడలించి రైతులనుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.