Jun 18,2023 21:53
  • కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉన్న 2.95లక్షల మంది కాంట్రాక్టు , ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌, టీచర్స్‌ జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఇందులో భాగంగా సదస్సు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించింది. విజయవాడ బందరు రోడ్డులోని ఎంబివికెలో ఆదివారం కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ జెఎసి రాష్ట్ర సదస్సు బి.కాంతారావు అధ్యక్షతన జరిగింది. ఈనెల 22న జగనన్నకు చెబుదాం టోల్‌ ఫ్రీ నెంబరు 1902కు ఫోన్లు చేయడం, 25న జిల్లా సదస్సులు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, జూలై 2న, మండల, పట్టణ సదస్సులు, 5న సిఎమ్‌కు ఇ-మెయిల్స్‌ పంపడం, 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఓడిలకు ఇ-మెయిల్స్‌ పంపడం, 15న మంత్రులు, ఎమ్మెల్యేలకు, 20న జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, ఆగస్టు 5న నాయకుల నిరాహార దీక్షలు చేపట్టాలని ఆగస్టు 14న చలో విజయవాడ నిర్వహించాలని కూడా చేపట్టాలని సదస్సు నిర్ణయించింది.
ఈ సందర్భంగా ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, , వర్కర్స్‌ జెఎసి గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2022 డిసెంబరు 31 నాటికి పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగి మూడునుంచి ఐదేళ్లు సర్వీసు పూర్తి అయిన వెంటనే రెగ్యులర్‌ చేసేలా నిర్దిష్ట ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు..రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్‌2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్డ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ జెఎసి ఆహ్వానిస్తుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యుత్తు, ఆర్‌టిసి, టూరిజం, హౌసింగ్‌ వంటి 26 ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్‌, పంచాయితీ వంటి స్థానిక సంస్థలు, ప్రభుత్వ పథకాలు, యూనివర్శిటీలు, టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్దతిన అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. వీరితో పాటు అనేక సంస్ధల్లో మూడు దశాబ్ధాలుగా ఎన్‌ఎమ్‌ఆర్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌, టైమ్‌స్కేల్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా ఏ నాటికైనా రెగ్యులర్‌ అవుతామనే ఆశతో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఎవి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతిపక్షనేత హోదాలో నేటి సిఎమ్‌ జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 6,667 మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేయాలన్న నిర్ణయం తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కొత్తగా వచ్చారని, ఏడాదే అయ్యిందంటూ మంత్రి బొత్ససత్యనారాయణ చెప్పడం సరికాదన్నారు.
ఈ సదస్సులో తీర్మానాలను రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ ప్రతిపాదించగా ఆయా డిమాండ్లను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో జెఎసి సెక్రటరీ జనరల్‌ ఎం. బాలకాశి, వైస్‌ ఛైర్మన్‌లు విజరుకుమార్‌రాజు, విజయ్, నూర్‌మహమ్మద్‌, ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్షులు ఆదినారాయణ, ఎస్‌ఎస్‌ఎ పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ అధ్యక్షులు సిహెచ్‌ దేవేంద్రరావు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నేత సుందరయ్య, యునైటెడ్‌ మెడికల్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఎపిఎస్‌జి కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సెస్‌ యూనియన్‌ కార్యదర్శి సౌమ్యరేఖ, ఆఫ్కాస్‌ పవన్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ గంగరాజు, ఎపిసాక్స్‌చంద్రశేఖర్‌, ఎపిఐఐసి భాగ్యలక్ష్మీ, యూనివర్శిటీ నాయకులు కెఎస్‌ కోటేశ్వరరావు, సంజీవ్‌, మంజునాథ్‌, గోపాల్‌, ఆర్టీసీ విజయరాజు, ఆరోగ్యమిత్ర కంటింజెంట్‌, ఇఎస్‌ఐ అర్భన్‌ హెల్త్‌ రత్నరాజు, హెల్త్‌ అసిస్టెంట్స్‌ సుబ్బరామయ్య, కంటింజెంట్‌ నాయకులు దుర్గారావు పాల్గన్నారు.