Jun 18,2023 17:01
  • శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం..
  •  విద్యార్థులను అభినందించిన సీఐ పవన్ కుమార్, ఎస్సై రాజశేఖర్ రెడ్డి

ప్రజాశక్తి-నార్పల : గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో విజయ దుందుభి మోగించిన శివక్రిష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులను సీఐ పవన్ కుమార్, ఎస్సై రాజశేఖర్ రెడ్డి అభినందించారు. మండల కేంద్రం అయిన నార్పలలో ఆదివారం శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభ కార్యక్రమానికి సీఐ పవన్ కుమార్, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మెల్లంపూటి సూర్యప్రకాష్ హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా సీఐ పవన్ కుమార్ మాట్లాడుతూ సంపద చాలామంది వద్ద ఉంటుందని కానీ దాన్ని పంచే గుణం కొందరికే ఉంటుందన్నారు. అలాంటి గొప్ప మనసున్న వారి జాబితాలో శివకృష్ణచౌదరి చోటు సంపాదించుకున్నాడని తెలిపారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా విద్యా దానం గొప్పదని అలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బొందలవాడ శివకృష్ణచౌదరిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు లగినేని నాగరాజు మాట్లాడుతూ శిక్షణ మొదలైనప్పటి నుండి పూర్తీ అయ్యేంత వరకు తమ సొంత పిల్లలుగా బాధ్యత తీసుకుని వారిని తీర్చి దిద్దడంతో శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ బృందం తనకు అందించిన తోడ్పాటుతోనే ఇంతటి ఘన విజయం దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, నాగార్జున, చంద్రమోహన్, ద్వారకా విల్లాస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బాబా ఫకృద్దీన్, పుల్లయ్య, వెంకటరెడ్డి, స్కూల్ కమిటీ ఛైర్మెన్ గండ్లురి శ్రీధర్, యంగ్ ఇండియా నాగభూషణ, గవ్వల శివశంకర్, రాజేంద్ర, కండెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.