Mar 25,2023 15:09

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5వ తేదీన జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కచేరి సెంటర్ కు జీపు జాత చేరుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 5న చల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతం జాతర ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతులపై వేధింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి రాను రోజుల్లో కార్మికులు కర్షకులు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాలతో వారిని ఆత్మహత్యలకు పూరిగొల్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములను కార్పోరేట్ కంపెనీలకు అప్పగించే నల్ల వ్యవసాయ చట్టాలను కార్మిక వర్గ మద్దతుతో రైతు సంఘాలు పోరాట ఫలితంగా రద్దు చేశారన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ ప్రదర్శనలో కార్మికులు, కర్షకులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్, ఉపాధ్యక్షులు ఇందుకూరి సూర్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, కేతా గోపాలన్, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, సిపిఎం నాయకులు సిర్రా  నరసింహామూర్తి, బొర్రా ధర్మారావు, సిర్రా  విగ్నేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు.