ప్రజాశక్తి-పెనుకొండ : సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జీపు జాత గురువారం పెనుకొండ చేసుకుంది. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు జీపు జాతలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ లు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు కౌలు రైతులు, ప్రజా సమస్యలు మరింతగా పెంచిందన్నారు. మన సమస్యలు పరిష్కరించకుండా అత్యంత ధనవంతులైన ఆదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగితేలుతోందని విమర్శించారు. దేశ రాజ్యంగం ప్రసాదించిన కనీస ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని తెలిపారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టి పరిపాలిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, కర్షక, రైతు ప్రజా వ్యతిరేకంగాను, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడుదాలకు దేశ సంపదను దోచిపెట్టి విధంగా ఉందని తెలిపారు.ప్రజా వ్యతిరేక విధానాలను, మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజా అనుకూల విధానాల సాధన కోసం ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక పోరాట ప్రదర్శన అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఫక్రుద్దీన్, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప,చిన్న వెంకటేష్, తిప్పన్న, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బావమ్మ తదితరులు పాల్గొన్నారు.










