
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్, పలాస: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసు నిబందనలకు లోబడి వాడవాడలా మండపాలను సిద్ధం చేస్తున్నారు. చవితి వేడుకలకు అవసరమైన సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. వేడుకలకు అవసమయ్యే సామగ్రిని కొనుగోలు చేసేందుకు జనం పోటెత్తారు. దీంతో శ్రీకాకుళం నగరం, పలాస పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిటకిటలాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మార్కెట్‌కు జనం తరలిరావడంతో పెద్దఎత్తున కొనుగోళ్లు సాగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పండగ వ్యాపారాలు బాగా సాగాయి. పూజా సామగ్రికి అవసరమైన ఆరు రకాల ఫలాలను రూ.70, పువ్వులు కేజీ రూ.120 నుంచి రూ.150 వరకు వ్యాపారులు విక్రయించారు. మట్టి వినాయకులు, కుమ్మరి బొమ్మలు, పండ్లు, పత్రి, ఇతర పూజా సామగ్రిని విక్రయించుకుని ఉత్సవాలకు సిద్ధం చేసుకుంటున్నారు. పెద్దఎత్తున మట్టి బొమ్మలను వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులు ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి బొమ్మలు రూ.30 నుంచి రంగుల బొమ్మలు రూ.వేలాదిగా ధరలు నిర్ణయించారు. బొమ్మను బట్టి ధర నిర్ణయించి విక్రయించగా పూజా సామగ్రి, పళ్లు, పువ్వుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వినాయక చవితి సందడి మార్కెట్‌లో వ్యాపారులకు కాసులు కురిపించగా... సామాన్యులకు ఈ పండగ బారంగా మారింది.