
*వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - పోలాకి:స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో రూ.550 కోట్ల అవినీతికి పాల్పడినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చిందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకు ఈ విషయం ఇప్పటికి అర్థమై ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వైసిపి శ్రేణులు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసిపి సోషల్ మీడియా విభాగం ఈ విషయంలో చురుగ్గా ఉండాలని, బాబు ఏ తప్పు చేయలేదని పచ్చ మీడియా గగ్గోలు పెట్టే అంశాలను, అసత్యాలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ కేసులోని అన్ని అంశాలను సామాన్య ప్రజలకు సైతం పూర్తిగా తెలిసేలా వాస్తవాలను వివరించడంలో సోషల్ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ఖజానాను దోచేసి, పోలవరం లాంటి ప్రాజెక్టులను ఎటిఎంలా వాడుకొని రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన చంద్రబాబుపై పూర్తిస్థాయి విచారణలు చేపట్టి తిన్న సొమ్మంతా కక్కించాల్సి ఉందని పేర్కొన్నారు.