ప్రజాశక్తి-ఓబులదేవర చెరువు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతీ యువకులకు చట్ట సభల్లో 40 శాతం అవకాశం కల్పిస్తామని, ప్రతి పేటా డిసెంబర్‌లో జాబ్ క్యాలెండర్ విలడుదల చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన యువగళం పాదయాత్ర 51వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండలంలోని సున్నంపల్లి క్రాస్ విడిది కేంద్రం నుంచి ఆదివారం ప్రారంభించారు. మహిళలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. రామయ్యపేటలో లోకేష్ మహిళలతో, గౌనిపల్లిలో ఎస్సీలతో సమావేశమయ్యారు. అల్లపల్లిలో ఆటో వర్కర్లతో భేటీ నిర్వహించారు. పగడాలపల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. పలు సమస్యలను యువకులు, మహిళలు, ఆటో డ్రైవర్లు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలనూ పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. 2024లో టిడిపి గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. టిడిపి హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. చంద్రబాబు నాయుడు బిసిలకు పెద్దపీట వేశారన్నారు. జగన్ ప్రభుత్వంలో బిసిలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చట్ట సభల్లో యువతీ యువకులకు 40 శాతం అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు, యువతకు అండగా ఉంటామన్నారు. ప్రతి ఏటా డిసెంబర్‌లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయం పెంచేలా చూడాలన్నారు. ప్రయివేటు సంస్థలను తీసుకురావాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో ప్రయివేటు సంస్థలు మన రాష్ట్రంలోకి రాకపోగా.. ఉన్న సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని తెలిపారు. సిఎం జగన్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. సొంత తల్లి, చెల్లి, ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని విమర్శించారు. 2024లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో టిడిపి కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పాల్గొన్నారు.










