ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని తాడేపల్లిగూడెం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 36 లక్షల 80 వేల రూపాయలు విలువైన 45 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు ప్రాంతాల్లో ఏలూరు జిల్లా తంగళ్లమూడి గ్రామం శివ గోపాలపురం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఇక్బాల్ భాష, హనుమాన్ నగర్‌కు చెందిన బాదరవాడ సురేష్ కుమార్ ఈ మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, బస్టాండ్లు, బ్యాంకులు వంటి ప్రాంతాలను ఎంచుకుని వీరు మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరిలో మొహమ్మద్ ఇక్బాల్ గతంలో తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడని, ఇక్బాల్ మోటార్ సైకిళ్లు దొంగిలించి సురేష్ కుమార్ ద్వారా అమ్ముతున్నాడని తెలిపారు. మంగళవారం ఉదయం యగర్లపల్లి ఫ్లై ఓవర్ దగ్గర ముద్దాయిలను పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ సిఐ ఎస్‌వివి నాగరాజు, ఎస్‌ఐలు బోనగిరి రాజు, గరగ జ్యోతీ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీను, ఎం.సూర్యచంద్రరావు, కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు, బి.రాజేష్, పి.అప్పారావును ఎస్‌ఫి అభినందించారు. వారికి రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్‌పి ఎవి.సుబ్బరాజు, డిఎస్‌పి బి.శ్రీనాథ్, సిఐ నాగరాజు, రూరల్ సిఐ మూర్తి పాల్గొన్నారు.










