Apr 17,2023 14:30
  • కడియంలో రైతుల ఆందోళన

ప్రజాశక్తి-కడియం : ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం అన్యాయమని, రైతు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి వెంటనే మద్దత్తు ధర చెల్లించాలని కడియం ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షుడు  ఎం.సత్యనారాయణ, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని రైతు నాయకులతో కలిసి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండల కేంద్రమైన కడియంలో రైతు, కౌలు రైతుల పక్షాన సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున నినదిస్తూ ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని , తాసిల్దార్ ఎం.సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని , పరిమితులు విధించడం వల్ల మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలో కూడా ప్రభుత్వమే తెలియజేయాలన్నారు. అలాగే గత పంటకు సంబంధించి రైతులకు హమాలీ ఛార్జీలు నేటికీ విడుదల చేయలేదని , వాటిని తక్షణం విడుదల చేయాలని , ప్రస్తుత పంటకు సంబంధించి కూడా ధాన్యం కొనుగోళ్లతో పాటు హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, పితాని శివరామకృష్ణ , వాసంశెట్టి నాగబాబు, తమ్మ నాగేంద్ర, చిక్కాల ఈశ్వరరావు, గళ్ళ అమ్మిరాజు, శాకా ఆదినారాయణ, తోట శ్రీను, తామెళ్ళ వెంకటేశ్వరరావు, ఆకుల కిట్టయ్య, చెక్కపల్లి సూర్యచంద్రరావు, కొప్పాల నాగు, అడప వీరబ్రహ్మం,  రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.