అనంతపురం ప్రతినిధి : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడివి చీప్ పాలిటిక్స్ అని విద్యుత్, భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాలులో అనంతపురం, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పుంగనూరు ఘటనలో వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరని చెప్పారు. టిడిపి నాయకులే పోలీసులపై దాడికి పాల్పడ్డారన్నారు. తిరిగి వారే ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రపతికి ఆయన ఎందుకు లేఖ రాశారో తెలియడం లేదని పేర్కొన్నారు. టిడిపి వారు చేసిన దాడిలో పోలీసులకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చీప్ పాలిటిక్స్‌ను బాబు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఆయన అధికారంలో ఉండగా సిబిఐ అక్కర్లేదని చెప్పిన బాబు ఇప్పుడు సిబిఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇరిగేషన్‌లో రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెబుతున్న చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏమిటో వారే చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఏ మాత్రం అవగాహన ఉన్నా ఈ విధమైన వ్యాఖ్యలు చేయరని మండిపడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాన్ చంద్రబాబు రాసిన స్క్రిప్టును చదువుతున్నాడని ఎద్దేవా చేశారు.










