May 04,2023 21:53

చిన్నారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

        ప్రజాశక్తి-అనంతపురం   టిడిపి అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ లక్ష్మమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 15, 16వ డివిజన్లలో కార్పొరేటర్లు గూడూరు మల్లికార్జున, హసీనా, డివిజన్‌ కన్వీనర్‌ సుకేష్‌ ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు వివరించారు. తర్వాత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. ముఖ్యంగా సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థలతో ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. గతేడాది కాలంగా తాడు చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరుగుతున్నామన్నారు. ప్రజల వద్దకు వెళ్లినప్పడు తమ ప్రభుత్వంపై సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతపురం చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రూ.600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే భరించలేని ప్రతిపక్ష పార్టీలు మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో మరోమారు జగన్‌ సిఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ మొహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ ఫయాజ్‌, వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ కాఘజ్‌ ఘర్‌ రిజ్వాన్‌, ఆర్టీసీ రీజినల్‌ ఛైర్మన్‌ మంజుల, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గౌస్‌బేగ్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ ఆలుమూరు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైఫుల్లా బేగ్‌, మదన్‌మోహన్‌రెడ్డి, కొర్రపాడు హుసేన్‌పీరా, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.