Sep 01,2023 21:58

విద్యుత్‌ బిల్లులను కాల్చివేస్తున్న సిపిఎం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకపోగా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసి భారాలు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే పడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్‌ ఛార్జీలు పెంచి భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం విద్యుత్‌ బిల్లులు దహనం చేసి నిరసన తెలిపారు. సిపిఎం అనంతపురం నగర 1వ కమిటీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ సర్కిల్‌ సమీపంలోని వార్డు సచివాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై భారాలు మోపడమే పనిగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కరెంటు ఛార్జీలను యూనిట్‌ పైన కాకుండా సర్వీస్‌ ఛార్జీ, ట్రూ అఫ్‌ ఛార్జీల పేరుతో వివిధ రకాలైన అదనపు భారాలను మోపి అసలు కంటే వడ్డీ ఎక్కువ అన్నట్లు వాడిన కరెంటు కంటే అదనంగా వస్తున్న కరెంటు బిల్లు ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు కావని, ఇవి ప్రజలను హింసించే ప్రభుత్వాలని విమర్శించారు. ఒక వైపు వర్షాలు పడక వేసిన పంట ఎండిపోతుంటే ఏమి చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉన్న రైతులపై విద్యుత్‌ కోతలు గోరుచుట్టుపై రోకలిపోటులా తయారు అయ్యాయన్నారు. బోర్ల కింద వేసుకున్న పంటను కాపాడుకోలేక రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా ఒక్క ప్రజా ప్రతినిధి కూడా వీరి సమస్యపై పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ విధానాలను విమర్శించకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం ప్రజల పట్ల అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వి.సావిత్రి, నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, సభ్యులు వెంకటనారాయణ, ప్రకాష్‌, మసూద్‌, వలీ, ఎన్టీఆర్‌ శీన, రాజు, ప్రసాద్‌, ఎర్రిస్వామి, లక్ష్మీనారాయణ, ఏటీఎం నాగరాజు, తిరుమలేసు, వరలక్ష్మి, రామాంజి, చిరంజీవి, ఫర్యాది, మరియమ్మ, భాగ్యమ్మ పాల్గొన్నారు.