ఆత్మకూరు : రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం ఈ నెల 3వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్న మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టిడిపి నాయకులు పరిశీలించారు. సోమవారం ఉదయం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బికె.పార్థసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు ఆత్మకూరు పరిధిలోని పేరూరు డ్యాం పిల్ల కాలువలను పరిశీలించారు. ఆత్మకూరు మండల కేంద్రానికి సమీపంలోని సింగనగుట్ట దగ్గర గత టిడిపి ప్రభుత్వం హయాంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు రిజర్వాయర్‌కు నీరందించే కాల్వ రెండవ లిఫ్ట్ దగ్గర ఆగిపోయిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు విలేకరులతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ కాలవ పనులు నిలిచిపోయాయన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు సీఎం జగన్ ఒక గ్రహణంలా పట్టుకున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా సాగునీటి కాలువ పనులు చేయించలేదన్నారు. ముఖ్యమంత్రి, వైసిపి మంత్రులు కేవలం మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. టిడిపి హయాంలో పనులు కేటాయించడమే కాకుండా భూసేకరణ చాలా వరకు పూర్తి చేసినట్లు వివరించారు. కొంతమంది రైతులకు పరిహారం కూడా చెల్లించామని తెలిపారు. వైసిపి అధికారంలోకి రావడంతో ఈ పనులకు గ్రహణం పట్టుకుందన్నారు. రైతులకు పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి ఉంటే ఈపాటికి పేరూరు ప్రాజెక్టుకు నీరు అందించే పనులు పూర్తయ్యి, వేలాది ఎకరాలు సాగులోకి వచ్చేవన్నారు. కానీ వాటికి ఏమాత్రం నిధులు కేటాయించకుండా ఆర్భాటపు ప్రకటనలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అయ్యిందని మండిపడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ నాలుగేళ్లుగా చెబుతున్నారని, కానీ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇచ్చింది లేదన్నారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే తమ అధినేత చంద్రబాబు సీమసాగునీటి ప్రాజెక్టుల పర్యటన చేస్తున్నారని చెప్పారు. రైతులు, టిడిపి శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్.నారాయణ చౌదరి, శశాంక్ బాబు, ఓబుళపతి, మండల నాయకులు పాల్గొన్నారు.










