
* రూ.371 కోట్లు దోచుకుతిన్నారు
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్మనీలో ఉండే కంపెనీ (సీమెన్స్) పేరు చెప్పి రూ.371 కోట్లు దోచుకున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గార ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలే దీన్ని నిర్ధారించాయన్నారు. రానున్న కాలంలో ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలని చెప్పారు. లోకేష్ తన తండ్రి నిజాయతీపరుడని చెప్తున్నాడని, ప్రజలు దీన్ని నమ్మేందుకు అమాయకులుగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ దొంగలను దేశంలో ఉండే కీలక దర్యాప్తు సంస్థలు విచారణ చేసి పట్టుకున్నాయన్నారు. వీరికి అనుకూలంగా ఎల్లో మీడియా రోజుకో కథనం తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అమ్మ తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఆప్యాయత, అనురాగం అందుతుందని, ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాతృత్వానికి ప్రతీకలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శక్తివంతమైన తరం రూపకల్పన తల్లి తర్వాత అంగన్వాడీ కార్యకర్తలే కీలకమని, పరిమిత సంతానం కలిగిన కుటుంబాలు అన్ని సదుపాయాలు కలిగి ఉంటారని సూచించారు. అందువల్ల ఆ దిశగా ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలన్నారు. జిల్లాలో ఉన్న రూరల్ ప్రాజెక్టులలో గార ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మంచి ఫలితాలు ఇచ్చే ప్రక్రియలో ముందున్న కార్యకర్తలు చిన్నారులపై అదే శ్రద్ధను కొనసాగించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటన చేసినప్పుడు ప్రజలకు చక్కటి జీవనం అందించాలని భావిస్తుంటామని, అక్కడ నదుల్లో మురుగు అన్నది ఎక్కడా కనిపించదన్నారు. ఇక్కడా పౌరులు బాధ్యతగా మెలగాలన్నారు. గార సిడిపిఒ రాధ మాధవి అధ్యక్షతన కార్యక్రమంలో జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి బి.శాంతిశ్రీ, ఎంపిపిలు అంబటి నిర్మల శ్రీనివాస్, గొండు రఘురాం, జెడ్‌పిటిసిలు రుప్ప దివ్య, మార్పు సుజాత, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.