చంద్రబాబు, లోకేష్‌లకు మతిభ్రమించింది : ఎమ్మెల్యే
ప్రజాశక్తి చిత్తూరు అర్బన్: కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోరఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పంలో జనం చంద్రబాబును చిత్కరించుకుంటున్నారు. ఇది తట్టుకోలేక తండ్రీ కొడుకులు నోటికి వచ్చినట్లు వాగుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంతలేదు నీ వయస్సు అన్నారు. పెద్దిరెడ్డికి ఈరోజు కుప్పం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆయన కాలిగోటికి కూడా నువ్వు సరిపోవని ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు కూడా పెద్దిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంంగా ఉందని లోకేష్‌పై విరుచుపడ్డారు. పుంగనూరు సంగతి పక్కన పెడితే ఈరోజు కుప్పంలో మీ తండ్రి కొడుకులు తిరగలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇంకోసారి పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే ప్రజలే మీరు తగిన బుద్ధి చెబుతారన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రజల ధనం కొల్లగొట్టిన చరిత్ర మీదేనని, బిక్షం వేసినట్లు ఒక పూట అన్నం పేరుతో కోట్లు కొల్లగొట్టారు. చిత్తూరులో అన్న క్యాంటీన్ పేరుతో 40లక్షలు భోంచేసిన చరిత్ర మీదేనని అన్నారు. కుప్పం ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు చేయలేని అభివద్ధి ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కుప్పంలో ఇన్ని సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ చేసిందే మీ నాయకులు అని, మీ నాయకులు చేసిన మొత్తం అక్రమ వ్యాపారాన్ని బయటకు తీస్తామని, అందరిని లోపల వేయిస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న వారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే సత్తా తెలుగుదేశానికి లేదని, ఇప్పుడు కూడా జనసేన, బిజెపితో అపవిత్ర పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ ఒంటరిగా 175సీట్లు గెలిచి ప్రజల్లో తన బలం ఏమిటో చూపిస్తారని తెలిపారు.










