ప్రజాశక్తి-కణేకల్లు టిడిపి అధినేత చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఆయన ఎప్పుడు వచ్చినా కరువు ఖచ్చితంగా వస్తుందని విప్ కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం మండల పరిధిలోని సొల్లాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో నాగలికి పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు విలయతాండవం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. అదే జగన్ సిఎం అయ్యాక సకాలంలో వర్షాలు కురిసి రైతులు సిరి సంపదలతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచి గోపాల్‌రెడ్డి, ఎంపిటిసి కేశవరెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, సోమలింగ, శివరాంరెడ్డి, జయచంద్ర, శ్రీధర్, సొసైటీ అధ్యక్షులు తిమ్మప్ప కేశవరెడ్డి, మాజీ జెడ్పిటిసి నాగిరెడ్డి, మరెన్న, రెవెన్యూ అధికారి గోవిందురెడ్డి, ఎఒ శ్రవణ్, చెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వొద్దు..
విద్యుత్ కాంట్రాక్టర్లకు మండలంలోని రైతులు ఎవరూ డబ్బులు ఇవ్వకూడదని విప్ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని సొల్లాపురం గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు రూ.లక్షలు అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు విప్ కాపు స్పందిస్తూ కాంట్రాక్టర్లు ఎవరైనా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏరువాక సందర్భంగా పొలం దున్నుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి










