ప్రజాశక్తి - ఆచంట
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వారుపై రాళ్ల దాడి హేయమైన చర్య అని ఆచంట నియోజకవర్గ ఎస్‌సి సెల్ అధ్యక్షులు బీరా నరసింహమూర్తి అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆచంటలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరసింVమూర్తి మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఒక స్వేచ్ఛ ఉందన్నారు. ప్రతిఒక్కరికీ భావ వ్యక్తికరణ స్వేచ్చ ఉంటుందన్నారు. ప్రజల్లో తిరగడానికి పోలీసు అధికారులు అనుమతి ఇచ్చిన తరువాతే ఆయన బయలుదేరానన్నారు. శనివారం సాయంత్రం యర్రగుండపాలెంలో పోలీసు అధికారుల అనుమతితో చట్ట ప్రకారం సభ నిర్వహించడానికి వెళ్తే అక్కడ వైసిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం, పోలీసులు కనీసం చంద్రబాబు నాయుడుకు రక్షణ కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌సి సెల్ కార్యదర్శి కనపాల వెంకటేశ్వరరావు, అచంట నియోజకవర్గ ఎస్‌సి సెల్ అధికార ప్రతినిధి తానేటి మదన్, మండల ఎస్‌సి సెల్ అధ్యక్షులు ఆకుమర్తి మోహనరావు, పెనుగొండ మండల ఎస్‌సి సెల్ అధ్యక్షులు వెన్నపు వెంకటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు సిర్రా బాలాజీ పాల్గొన్నారు.
నరసాపురం రూరల్ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వారుపై ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పట్ల వైసిపి అల్లరి మూకల తీరు అతి హేయమైన చర్య అని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మంత్రి సురేష్ చంద్రబాబు పర్యటనలో అలజడికి కుట్ర పన్నారన్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో దళితులను, చివరికి దళిత ఉద్యోగులను కూడా వైసిపి ప్రభుత్వం బహిరంగంగా హత్యలు చేయిస్తుంటే నోరు మెదపలేని మంత్రి సురేష్ తాను దళిత పక్షపాతినని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నరు. డాక్టర్ అచ్చెన్నను ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వేధించి చంపేస్తే ఆయన నోరు మెదపలేదన్నారు. దళితుడైన కారు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని వైసిపి ఎంఎల్‌సి హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, కావలిలో కరుణాకర్, చీరాలలో కిరణ్ వీరి హత్యలకు సురేష్ ఏం సమాధానం చెప్తారన్నారు. ఇటీవల జగన్ సొంత నియోజకవర్గంలో మహిళను రేపు చేసి చంపారని ఇవేమీ మంత్రి సురేష్‌కి పట్టడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న అశేష జనవాహినిని చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.










