మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
చంద్రబాబు ఆరోగ్యంతో వైసిపి చెలగాటం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పై నేడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటుందని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు డిఐజి రవికిరణ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఆరోగ్య విషయం లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్య విషయంపై డాక్టర్ల చేత విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించకుండా ప్రెస్ మీట్ పెట్టడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ప్రస్తుత డిఐజి రవి కిరణ్ రెడ్డి గతంలో నెల్లూరులో పనిచేశారని అప్పట్లోనే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారన్నారు. ఆయన అవినీతిపరుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి సమీప బంధువు అని అందువలనే ఆయన వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో జగన్ 18 నెలలు చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు ఏ క్లాస్ సౌకర్యాలు అందించామన్నారు. డిఐజి రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ మా జైల్లో 239 మంది ఖైదీలు ఉన్నారని వారిలో చంద్రబాబు ఒక్కడని ఆయన అనడం శోచనీయమన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 73 సంవత్సరాల వయసులో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే సామాన్య ఖైదీగా పరిగణించడంపై పలు అనుమానాలు దారితీస్తుందన్నారు. సజ్జల ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై చులకన భావంతో మాట్లాడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు, 10వ డివిజన్ ఇన్‌ఛార్జ్ తిరుమల నాయుడు, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, ప్రశాంత్ అంబ్రెల్లా వెంకటేశ్వర్లు నాయుడు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.










