ప్రజాశక్తి-ఉరవకొండ టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టులో ఎలాంటి ప్రభుత్వ కక్షసాధింపు లేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం వజ్రకరూరులో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో పోలీసులు చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన కొడుకు సిఎం జగన్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యంగా జగన్‌ను సైకో సీఎం అనడాన్ని తప్పుపట్టారు. పేదల సంక్షేమం కోసం దేశంలోనే ఏరాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పేదలకు సిఎం చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక నారా లోకేష్ నిత్యం అభాండాలు వేస్తూ.. కట్టు కథలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. టిడిపి రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే ఆ పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ఆఖరికి చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తిని సాక్ష్యాలు లేకుండా సీఐడీ అరెస్టు చేస్తుందా.. అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే సీఐడీ అరెస్టు చేసిందన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు ప్రసాద్‌రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపిపి దేవీబాయి, సర్పంచి మొనాలిసా, వైస్ ఎంపిపి సుశీలారాణి, పిఎసిఎస్ ఛైర్మన్ సుధీర్‌రెడ్డి, పెద్దహోతూరు సర్పంచి సురేంద్ర, ఎంపిటిసి ఫిరోజ్‌బాను, సామానాయక్, రామకృష్ణ, వైద్యనాథ్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పరమేష్, సుభాష్, గోవర్ధన్, చైతన్య, నారాయణస్వామి, అల్లప్ప, ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి










