
* టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్
ప్రజాశక్తి- ఆమదాలవలస: మాజీ సిఎం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు సైకో పాలనకు నిదర్శనమని టిడిపి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవికుమార్ అన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టి దీక్షకు సంఘీభావంతో సోమవారం నిర్వహించిన సత్యమేవ జయతే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు మాజీ సైనికులు సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకొని వన్ వే కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని చూస్తేనే సిఎం జగన్మోహన్‌రెడ్డి ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. నేడు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో, అరెస్టులతో టిడిపి నాయకులు భయపడేది లేదని హెచ్చరించారు. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అన్యాయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఒక చేత్తో రూ.వంద ఇచ్చినట్టే ఇచ్చి... మరో చేత్తో రూ.వెయ్యి ప్రజల నుంచి దోచుకుంటున్న వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో ప్రజలు వైసిపికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ః గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశామని, ఇంత ఘోరమైన పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ సైనికుల విశ్రాంతి భవనానికి 10 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తామని వారికి హామీనిచ్చారు. దీక్ష ముగిసిన అనంతరం గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, బూర్జ జెడ్‌పిటిసి మాజీ సభ్యులు ఆనెపు రామకష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీత, మొదలవలస రమేష్, తమ్మినేని విద్యాసాగర్, కూన సత్యారావు, శివ్వాల సూర్యం, పల్లి సురేష్, అంబళ్ల రాంబాబు, కిల్లి సిద్ధార్థ, తమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు.