సీఎం ప్రసంగం అంతా 'బాబు'గురించే..
ఈసారి కుప్పంలో ఓడించాలన్నదే లక్ష్యం
ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన జగన్ పర్యటన
ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి, శాంతిపురం
ముఖ్యమంత్రి జగన్మోహన్ పర్యటన మొత్తం చంద్రబాబు లక్ష్యంగానే సాగింది. నియోజకవర్గంలో ఆయనను ఓడించాలనే ద్యేయంగా సీఎం కుప్పంలో 'చేయూత' మూడో విడత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. జన సమీకరణ మొదలు సభ ముగిసే వరకు అణువణువు ఇదే అంశం ఉంది. జిల్లావ్యాప్తంగా నలుమూలల నుంచి జనాన్ని కుప్పానికి తరలించి, రానున్న ఎన్నికల్లో ఇక్కడ వైసిపి గెలుస్తుంది అనే సంకేతాలను పంపించాలనే ఉద్దేశంతోనే వ్యూహం పన్నినట్లు సీఎం పర్యటన కనిపించింది. దీంతో వైసిపి నాయకులు మొత్తం ఒక్కటై ముఖ్యమంత్రి సభను విజయవంతం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రసంగం మొత్తం గంటపాటు సాగింది ఇందులో ముప్పావు వంతు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ముఖ్యంగా 33 ఏళ్ల కాలంలో చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని, తమ పార్టీనే ఇక్కడ అభివద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. బాబు విధానాన్ని ప్రజల్లో ఎండగట్టారు. వైసిపి ఇదివరకు కుప్పంలో చేసిన అభివద్ధిని వివరిస్తూనే రానున్న కాలంలో ఏమి చేయబోతాం అనేది కూడా స్పష్టంగా తెలిపారు. మరింత అభివద్ధి కావాలంటే ఇక్కడ చంద్రబాబును ఓడించి వైసిపి అభ్యర్థి భరత్ ను గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కుప్పానికి వరాల జల్లు
ముఖ్యమంత్రి తన ప్రసంగానికి చివర్లో మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ భరత్‌ల కోరికలపై స్పందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసేపటి క్రితం మంత్రి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ కుప్పానికి ఇంకా చేయాల్సిన పనులు గురించి అడిగారని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్2 లో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ని మరో ఆరు నెలలలో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. గుడిపల్లె మండలం యామిగానిపల్లె వద్ద 0.77టీఎంసీలతో, శాంతిపురం మండలం మదినేపల్లి వద్ద మరో 0.3టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీల సామర్ధ్యంతో రెండు రిజర్వాయర్లను రూ.250 కోట్లతో మంజూరు చేస్తామన్నారు. పాలార్ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ, పర్యావరణ సమస్యలున్న సంగతి అందరికీ తెలుసని,14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబునాయుడు.. ఆ సమస్యలకు పరిష్కారం తీసుకు రాలేదన్నారు. ఈ ప్రాజెక్టునూ శాయశక్తులా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. కుప్పం మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మిగిలిన నాలుగు మండలాల అభివద్ధి కోసం రూ.100 కోట్లు కావాలని భరత్ అడిగాడని, అదికూడా ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాల కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటానని, కుప్పం నియోజకవర్గాన్ని తన నియోజకవర్గంగా భావిస్తానని చెప్పారు.
హెలికాఫ్టర్‌లో కుప్పం చేరుకున్న సిఎం జగన్మోహన్‌రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపిలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎంఎల్‌ఎలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఆర్‌కె రోజా, ఎంఎస్ బాబు, కలెక్టర్ హరినారాయణ స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 50వేలపైన 400 బస్సుల్లో తరలించినట్లు అనధికారిక సమాచారం. ఉదయం 9 గంటలకే సభా ప్రాంగణం నిండిపోయింది. హర్షధ్వానాలతో సిఎంకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ ఛైర్మన్ ఎం.శైలజా చరణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి తిలకం పెట్టి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
వైయస్సార్ చేయూతతో అభివద్ధి చెందాను : మారెమ్మ, బంగారుపాళ్యం
వైయస్సార్ చేయూత నిధులతో అభివద్ధి చెందానని బంగారుపాలెం మండలం తిమ్మాజిపల్లి పంచాయతీకి చెందిన మారెమ్మ కుప్పం సభలో అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు వైయస్సార్ చేయూత కార్యక్రమంలో పాడె ఆవులు కొనుగోలు చేసి వచ్చే ఆదాయంతో అభివద్ధి చెందుతున్నానని చెప్పారు. పిల్లలను చదివించుకుంటున్నట్లు చెప్పారు.
సీఎం జగన్‌కు ఘన స్వాగతం
మూడో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో కుప్పం పర్యటనకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానిక రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం మాజీ ఆప్కో డైరెక్టర్, వైసిపి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి ఘన స్వాగతం పలికారు. జగన్ కు పుష్పగుచ్చంతో పాటు వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. మిద్దెలతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే బియ్యపుమధుసూదన్, భూమన కరుణాకర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, మేడా మల్లికార్జున, ఎంపి గురుమూర్తి, కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ ఉన్నారు.










