- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున.
ప్రజాశక్తి-రాయదుర్గం : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే 31వ తేదీ నుండి జరిగే రాష్ట్ర జాతను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున పిలుపునిచ్చారు. శనివారం రాయదుర్గంలో మునిసిపల్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ జాత యొక్క ముఖ్య ఉద్దేశం గురించి కార్మికులకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్ ఆక్టివిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 101 పద్దు కింద వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఈనెల 31వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు ఈ జాతాలో పెద్ద సంఖ్యలో పాల్గొనీ జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. మాట తప్పని మడమ తిప్పని, పార్టీ వైసీపీ అని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, మున్సిపల్ యూనియన్ నాయకులు రాము, తిప్పేస్వామి, మల్లేసి, సిద్ధలింగ, ఆదిలక్ష్మి, వన్నూరుస్వామి, విజయ్, ఎర్రిస్వామి మరియు కార్మికులు పాల్గొన్నారు.










