Sep 24,2023 23:28

అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం : చలో విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం చలో విజయవాడకు వెళ్లేందుకు పయనమవుతున్న అంగన్వాడీ కార్యకర్తలను రైల్వేస్టేషన్‌ వద్ద అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు తీరును తప్పుపట్టారు. రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండ్‌ కూడలి వరకు వందలామంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టా రు. దీంతో పోలీసులు బలవంతంగా వారందరినీ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నం చేయడంతో ఇరు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. టౌన్‌ ఎస్‌ఐ గోవిందరావు, రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ ఇతర పోలీస్‌ సిబ్బంది భారీగా తరలివచ్చారు.
పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన
చలో విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అకారణంగా పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం సాయంత్రం వరకు నిర్బంధించారు. సాయంత్రం 6 గంటల సమయం వరకూ విడిచిపెట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఆందోళనకు దిగారు. నాలుగేళ్లుగా తమ సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముందుకు రాలేదని, కనీసం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చలో విజయవాడ వెళ్తే అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. చీకటి పడుతుందని, ఈ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఎలా తమ గ్రామాలకు వెళ్తారని నిలదీస్తున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు కాళ్ల జయదేవ్‌, జగదీష్‌, సంతోష్‌కుమార్‌ పోలీస్టేషన్‌కు చేరుకుని అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు.
కార్యదర్శికి ముందస్తు నోటీసు
ఆమదాలవలస : మండ లంలోని దూసి అంగన్వాడీ కార్యకర్త, జిల్లా సహాయక కార్యదర్శి పంచాది లతాదేవికి ముందస్తు నోటీసులు జారీ చేసి హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నెల 25న చలో విజ యవాడ పిలుపునివ్వడంతో పోలీసులు ఆమెకు ముందస్తు నోటీసు అందజేశారు. అంగన్వాడీ కార్య కర్తలెవరూ చలో విజయవాడ వెళ్లడానికి అనుమ తులు లేవని తెలుపుతూ నోటీసులు అందజేశారు.
అరెస్టులు అప్రజాస్వామికం
తమ సమస్యల పరిష్కారానికి చలో విజయ వాడ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టులు అప్రస్వామికమని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. అంగన్వా డీల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. అరెస్టుల తో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.
అంగన్వాడీల నిర్బంధాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.తేజేశ్వరరావు, సిహె చ్‌.అమ్మన్నాయుడు ఒక ప్రకటనలో ఖండించారు.