చలిపులి..!
శ్రీ తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
శ్రీ ఉన్ని వస్త్రాలకు
పెరుగుతున్న డిమాండు
శ్రీ భారీగా అమ్మకాలు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
జిల్లాలో చలి గడగడలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలిపుట్టిస్తోంది. దీంతో ఉన్ని వస్త్రాలకు బాగా డిమాండు పెరుగుతోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆఫర్లతో అంగడి వారు ఆకర్షిస్తున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో ముసురు వానకుతోడు చలిగాలులతో జనం తల్లడిల్లుతున్నారు. ఉదయం ఏడు గంటలకు కూడా సూర్యుని వెలుగు రావడం లేదు. దీంతో జనం బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో పగటి పూట కూడా చలిచలిగా ఉంటోంది. ఉదయం వేళ అయితే 15 డిగ్రీలకు మించి పెరగడం లేదు. దీంతో ఉదయాన్నే లేచి పనులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాలు అమ్మేవాళ్లు, పేపర్ వేసే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్ని వస్త్రాలకు డిమాండు
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉన్ని వస్త్రాలకు డిమాండు పెరుగుతోంది. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చే వారు స్టాళ్లు పెడుతున్నారు. చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు వంటి ప్రాంతాల్లో దుకాణాలు పెడుతున్నారు. అలాగే దకాణాల్లో వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. రాజస్థాన్, షోలాపూర్ నుంచి ఎక్కువ మంది తెచ్చి అమ్ముతున్నారు. మూడు నెలల పాటు సాగే ఈ వ్యాపారంలో ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. వీరు జనవరి వరకు వ్యాపారం సాగించి తిరిగీ వెళ్లిపోతుంటారు. షోలాపుర్ దుప్పటి రూ.250 నుంచి రూ.300 వరకు సైజును బట్టి రూ.500 వరకు కూడా అమ్ముతున్నారు. ఇక స్వెటర్లు జత రూ.500 నుంచి రకాన్ని బట్టి అమ్ముడుపోతోంది. మహిళలు ఉపయోగించే రూ.200 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. ఇక మంకీక్యాప్‌లు, జర్కిన్‌లు కూడా అమ్ముడుపోతున్నాయి.










