Oct 03,2023 22:56

చి'వరి'కింతే

* వర్షాభావ పరిస్థితులతో అసంపూర్ణంగా పంటల సాగు
* 89 శాతం విస్తీర్ణంలోనే వరి పంట
* అన్నిరకాల పంటల సాగు 87 శాతమే
* ఒక్క ఎకరాలోనూ నువ్వులు వేయలేని పరిస్థితి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వెంటాడిన వర్షాభావ పరిస్థితులు చివరి వరకు సాగాయి. సీజన్‌లో కురవాల్సిన స్థాయిలో వర్షం పడలేదు. తొమ్మిది మండలాల్లో కరువుఛాయలు అలుముకున్నాయి. పలాస డివిజన్‌లోని ఆరు మండలాలు తీవ్ర వర్షపాతం లోటు జాబితాలో ఉన్నాయి. వర్షపాతం ఫలితంగా ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో పంటల సాగు కాలేదు. రాగులు, పెసలు, గోగు వంటి పంటల సాగు నాలుగో వంతు కూడా రైతులు వేయలేకపోయారు. నువ్వు పంటను ఒక్క ఎకరాలోనూ విత్తనాలు పడలేదు.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాలు సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 3,81,833 ఎకరాల్లో (87 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 3,39,588 ఎకరాల్లో (85 శాతం) సాగు అయింది. మొక్కజొన్న పంటను ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణంలో వేయాలని అనుకోగా 23,633 ఎకరాల్లో (90 శాతం) వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 2,763 (60 శాతం) మేర వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 1470 ఎకరాలు (32 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 93 ఎకరాలు (28శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1333 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా, ప్రస్తుతం 328 ఎకరాల్లో (25 శాతం) వేశారు. మినుములు 273 ఎకరాల్లో రైతులు విత్తనాలు వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 70 ఎకరాల్లో (26 శాతం) వేశారు. ఈ సంవత్సరం 165 ఎకరాల్లో సజ్జలు వేయాల్సి ఉండగా, 58 ఎకరాలు (35 శాతం) వేశారు. నువ్వు పంటను 98 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఒక ఎకరాలోనూ వేయలేదు.
పలు రకాల పంటలు 20 శాతం లోపే...
ప్రస్తుత ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 20 ఎకరాలు (11 శాతం), రాగులు 145 ఎకరాల్లో రైతులు వేస్తారని అంచనా వేయగా 20 ఎకరాల్లో (14 శాతం) వేశారు. గోగు పంటను ఈ సంవత్సరం 258 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా తీసుకోగా 48 ఎకరాల్లో (18 శాతం) వేశారు.
ఖరీఫ్‌లో 1.1 శాతం లోటు వర్షపాతం
ఖరీఫ్‌లో జిల్లా మొత్తం మీద 0.7 శాతం వర్షపాతం లోటు ఉంది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 696.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 688.7 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో తొమ్మిది మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఏడు మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. వర్షపాతం లోటు ఉన్న జాబితాలో టెక్కలి, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, నందిగాం, పోలాకి, జి.సిగడాం మండలాలు ఉన్నాయి.
పలాస డివిజన్‌లో కరువుఛాయలు
జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలో ఖరీఫ్‌ ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు వర్షాల పరిస్థితిని పరిశీలిస్తే, పలాస డివిజన్‌లో కరువుఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో తొమ్మిది మండలాలు తీవ్ర వర్షపాతం లోటు జాబితాలో ఉండగా, అందులో ఆరు మండలాలు ఈ డివిజన్‌లోనే ఉన్నాయి. పలాస డివిజన్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లో కలిపి సాధారణంగా 729 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 538.5 మి.మీ వర్షం పడింది. డివిజన్‌లో 26.1 శాతం మేర వర్షపాతం లోటు కనిపిస్తోంది. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో పరిస్థితులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. టెక్కలి డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం 755 మి.మీగా ఉండగా, ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి 854.5 మి.మీ వర్షం కురిసింది. 13.2 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం డివిజన్‌లోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం 635.9 మి.మీగా ఉండగా, సెప్టెంబర్‌ 30 నాటికి 666.2 మి.మీ వర్షం కురిసింది. డివిజన్‌లో 4.8 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది.