చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం
ముగ్గురు మృతి
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కమిషనర్
అగ్నిమాపక తీరుపై సర్వత్రా విమర్శలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
పేపర్‌ప్లేట్ల తయారీ ఫ్యాక్టరీలో విద్యుత్‌షాట్ సర్‌క్యూట్‌తో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన మంగళవారం ఆర్థిరాత్రి చిత్తూరు నగరంలోని రంగచ్చావీధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రంగచ్చారి వీధిలో భాస్కర్ (65) తన నివాసంలోని రెండవ అంతస్తులో పేపర్‌ప్లేట్ట తయారీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అదే భవనం మొదటి ప్లోర్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం కూడా పేపర్ తయారు చేసిన కార్మికులు విధులను ముగించుకొని ఇండ్లకు వెళ్లిపోయారు. అదేరోజూ ఫ్యాక్టరీ యజమాని భాస్కర్ కుమారుడు సాప్ట్‌వేర్ ఇంజనీరు డిల్లిబాబు పుట్టిన రోజు వేడుకులు నివాసంలోనే జరుపుకున్నారు. డిల్లిబాబు స్నేహితుడు బాలాజీ కూడా వేడుకల్లో పాల్గొని సమీపంలోనే ఇల్లు ఉన్నా స్నేహితుడితో పాటు కలసి నిద్రించాడు.
మంగళవారం రాత్రి 11.30-12 గంటల ప్రాంతంలో భాస్కర్ నివాసంలో విద్యుత్‌షాట్ సర్‌క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఇల్లంతా దట్టమైన పొగతో కూడుకున్న మంటలు చేలరేగడంతో సమీపంలోని ఇళ్లలోని వారు గుర్తించారు. లోనికి ప్రవేశించి ఇంట్లోనివారిని కాపాడలేనంతగా ప్రధాన ద్వారం వద్ద మంటలు వ్యాపించడంతో బయటి వ్యక్తులు లోనికి ప్రవేశించేందుకు వీలులేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఇంటివెనుక వైపు గోడలను పగలగొట్టి శ్రమించి లోనికి ప్రవేశించారు. ముగ్గురు వ్యక్తులు సృహ తప్పిపడి ఉండటాన్ని గుర్తించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇంటి యజమాని భాస్కర్ (65) ఆయన కుమారుడు డిల్లిబాబు (35) స్నేహితుడు బాలాజి (22) మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని తెలియడంతో రంగాచ్చారి వీధిలో తీవ్రవిషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకులు జరుపుకున్న రోజునే డిల్లిబాబు, స్నేహితుడు బాలాజి, తండ్రి భాస్కర్ మృతిచెండంతో కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో బంధువులు, స్నేహితులు శ్రమించి మంటల్లో నుండీ ముగ్గుర్ని బయటకు తీసుకొచ్చినా ప్రాణాలను కాపాడలేక పోయామంటూ రోధించారు. రెండవ పట్టణ సిఐ యతీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిమాపక తీరుపై సర్వత్రా విమర్శలు
జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో కిలో మీటర్ దూరంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి సమాచారం అందించినా సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోయారని, ఆలస్యంగా వచ్చిన సిబ్బంది కూడా మంటలు అదుపుచేసేందుకు అగ్నిమాపక వాహనం తీసుకురాకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటన, కుప్పంలో జగన్ పర్యటన రెండు రోజుల్లో సిఎం జగన్ కుప్పం పర్యటనతో అగ్నిమాపక వాహనాలు అందుబాటులో లేవంటూ అగ్నిమాపక అధికారులు చెబుతున్న సమాధానాలు రాజకీయనేతలు, ప్రజాసంఘాలు, ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించి ఉంటే ప్రాణాలను కాపాడంతో పాటు ఆస్తినష్టం తగ్గించే అవకాశం ఉండేదంటున్నారు.
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కమిషనర్
నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ. చిత్తూరులో అగ్నిప్రమాద బాధితులను బుధవారం ఉదయం కమిషనర్ పరామర్శించారు. నగరపాలక పరిధిలో రంగాచారి వీధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం సంఘటన స్థలాన్ని కమిషనర్ డాక్టర్ జె.అరుణ పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేపట్టాల్సిన చర్యలపై ప్రజారోగ్య విభాగం అధికారులకు సూచనలు చేశారు. అగ్నిప్రమాదంలో మతిచెందిన బాలాజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోధిస్తున్న మతుడి తల్లి కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఉన్నారు.










