Jun 21,2022 22:04

చిత్తూరు జిల్లాకు అమూల్‌ ప్రాజెక్ట్‌
270 బల్క్‌మిల్క్‌ సెంటర్లు ఏర్పాటు
జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకట్రావు
ప్రజాశక్తి- యాదమరి

చిత్తూరు జిల్లాకు త్వరలో అమూల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు అన్నిరకాల పనులు చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన యాదమరి మండలంలోని ఆర్‌బికే సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్‌బికె సెంటర్లలో పాడి రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమలు స్పందన కార్యక్రమం, వెటర్నరీ అసిస్టెంట్‌ల పనితీరు వీటన్నిటిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా 270 బల్క్‌మిల్క్‌ సెంటర్లును మొత్తం మంజూరు చేయడం రెవెన్యూ శాఖ సహకారంతో ఒక సెంటర్‌కు ఐదు సెంట్ల స్థలం గుర్తించి, డైరీ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ అప్పగించడం జరిగిందని తెలిపారు. రెండవ దశలో జిల్లాలోని ఆటోమేటిక్‌ బల్క్‌మిల్క్‌ కలెక్షన్స్‌ సెంటర్లను 2083 దాన్ని గుర్తించడం జరిగిందన్నారు. అందుకు అవసరమైన 3.5సెంట్ల స్థలంను గ్రామీణప్రాంతాల్లో గుర్తించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం దష్ట్యా గత ఆర్థిక సంవత్సరంకు 1040 షాప్‌ కట్టర్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. మొక్కజొన్న, జొన్నరకం గడ్డివిత్తనాలకు 450 మెట్రిక్‌టన్నులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. టిఎంఆర్‌ వరి ఎండుగడ్డిని ఒక రైతుకు 200 కేజీలు, రెండు నెలలకు సరఫరా చేస్తున్నామని కావలసిన రైతులు మరల ఆర్‌బికే సెంటర్ల ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు వెటర్నరీ అంబులెన్స్‌లను ఏడు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ వెహికల్స్‌ ప్రతి అవసరమైన పాడిరైతులకు అందుబాటులో ఉంటుందని దీన్ని పాడి రైతులు వారి అవసరం మేరకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు అన్నింటిపైనా క్షేత్రస్థాయిలో అమలు తీరును పర్యవేక్షించి, పరిశీలించి జిల్లా కలెక్టర్‌కి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో యాదమరి పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి అమర్నాథరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్లు పాల్గొన్నారు.