Jun 13,2022 23:23

చిత్తూరు ప్రభుత్వ అపోలో ఆసుపత్రి

ఎమర్జెన్సీకి రెఫరల్‌ తప్పదు
మందులు బయట కొనుక్కోవాల్సిందే
ఖరీదైన రక్త పరీక్షలు నిల్‌
అల్లాడుతున్న రోగులు
ప్రజాశక్తి చిత్తూరు ప్రతినిధి

ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తున్న చిత్తూరు, ప్రభుత్వ అపోలో ఆసుపత్రి తీరు మారేనా అనే ఆందోళన అంతటా వినిపిస్తోంది. ఇక్కడ వైద్యం తూతూ మంత్రంగా అందుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకు అపోలో అని తప్ప వైద్యం మాత్రం దారుణంగా ఉంది. క్లిష్టమైన కేసులు వస్తే తిరుపతి లేదా సిఎంసికి రెఫరల్‌ చేయడం తప్ప కష్టపడి వైద్యం చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అంతే కాదు ఇక్కడ పనికి రాని మందులు మాత్రమే దొరుకుతాయి. మంచివి దొరకవు. ఇవి కావాలంటే బయట ఉన్న మందుల షాపులకు వెళ్ళాల్సిందే.
పేరు గొప్ప...
జిల్లా కేంద్రం చిత్తూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రిని అపోలోకి అప్పజెప్పింది. ఇందులో భాగంగా మురుకంబట్టులో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీకి 300పడకల జిల్లా ప్రభుత్వాసుపత్రిని టీచింగ్‌ హాస్పిటల్‌గా లీజుకు ఇవ్వాలని అపోలో యాజమాన్యం 2015 కోరింది. ఉరుకులు పరుగుల మీద పబ్లిక్‌, ప్రయివేటు పార్టనర్‌ షిప్‌ (పిపిపి) మోడల్‌ పేరుతో అపోలో యాజమాన్యానికి ఐదేళ్ల లీజుకు ఇచ్చేందుకు అంగీకరించింది. 2015 అక్టోబరు 14న ఉత్తర్వు 125ని జారీ చేసింది. 300 పడకల స్థాయికి చిత్తూరు ప్రభత్వాసుపత్రిని అభివద్ధి చేస్తామని, ఇక్కడ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంలో అంగీకారాం తెలిపింది. అపోలో యాజమాన్యం తన పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ ఆసుపత్రి లీజును 33ఏళ్ళకు పొడిగించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక ఆలోచన చేయకుండా 2016 ఏప్రిల్‌ 28న ఉత్తర్వు నెంబర్‌ 42ని ఇచ్చింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, వైద్యవిభాగలన్నింటిలో అత్యంత ఆధునిక ఉన్నతీకరణ చేయాలని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ మేరకు ప్రత్యేక వైద్యులు, నర్సులును నియమించాల్సి ఉంది. దీన్ని పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి అధ్యక్షుడిగా ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ కన్వీనర్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌, అపోలో యాజమాన్యం ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఆసుపత్రి అభివద్ధిని మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాల్సి ఉంది.
అద్వానంగా సేవలు
అయితే ఇక్కడ సేవలు అద్వాన్నంగా ఉన్నాయని రోగులు మొత్తుకుంటున్నారు. గతంలో ఉన్న కలెక్టర్లు అనేక మంది అపోలో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు ఆరోగ్య సేవలు ఆనందించాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే వీటన్నింటినీ అపోలో యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. ఆపద సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈఆసుపత్రికి వస్తూ కనీస భరోసా కూడా అందడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల ఓగర్భవతి కాన్పుకోసం ఆసుపత్రికి వస్తే ఇక్కడ కాదని తిరుపతికి రెఫరల్‌ చేశారు. రోడ్డు ప్రమదాలు జరిగి ఆసుపత్రికి వస్తే ఇక్కడున్న డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. సిఎంసికి రెఫర్‌ చేసేసి చేతులు దులుపేసుకుంటున్నారు. చిన్నచిన్న మందులు కూడా బయట మందుల షాపుల్లో కొనుక్కోండి అంటూ స్వయానా ఇక్కడి డాక్టర్లే రాసిచ్చేస్తున్నారు. చిన్న పిల్లలకు జలుబ్బు చేస్తే కనీసం యాంటీబయాటిక్‌ కూడా బయట తెచ్చుకోండి అని రాసిస్తున్నారు. అన్ని విభాగాల్లో డాక్టర్లుకు బదులు వైద్యవిద్యార్థులును ఆరోగ్య సేవలుకు పంపిస్తున్నారు.
అపోలో లీజును రద్దు చేయాలి
సరైన వైద్యం అందించలేకపోతున్న అపోలో లీజును రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివద్ధి చేయాలి. అవసరమైన నిధులు విడుదల చేసి చిత్తూరు జిల్లా ప్రజల మన్నన పొందాలి.
- పి.చైతన్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి