Aug 23,2022 21:36

చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి : ఆర్‌డిఎంఏ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వార్డుకార్యదర్శులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అనంతపురం ఆర్డీఎంఏ (రీజినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) పివివిఎస్‌.మూర్తి చెప్పారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని అన్ని పురపాలక, నగరపాలక వార్డుప్రణాళికా కార్యదర్శులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి మూర్తి, ఆర్డీటీసీపీ దేవికుమారి, నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీఎంఏ మాట్లాడుతూ వార్డు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏఉద్దేశంతో కార్యదర్శులను ఉద్యోగాల్లో నియమించిందో ఆ ఉద్దేశం నెరవేర్చేలా స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలన్నారు. వార్డు ప్రణాళికా కార్యదర్శులు తమ జాబ్‌ చార్ట్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని ఆమేరకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలన్నారు. వార్డు పరిధిలో అన్ని రోడ్లకు సంబంధించి, ఖాళీస్థలాల పూర్తిస్థాయి సమాచారం సేకరించాలన్నారు. స్థలయజమానులతో సమన్వయం చేసుకొని నిర్మాణాలు చేపట్టే సమయంలో నిబంధనల మేరకు అనుమతులు పొందడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను తొలిదశలోనే అడ్డుకట్ట వేయాలని చెప్పారు. రానున్న 'రీసర్వే'పై ప్రత్యేకదష్టి సారించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం, పక్షపాతం ఉండరాదని అన్నారు. దేవీకుమారి మాట్లాడుతూ త్వరలో చేపట్టనున్న అర్బన్‌ 'రీసర్వే' పక్కగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెషన్‌ డిక్లరేషన్‌ పూర్తి అయినంతున విధి నిర్వహణలో మరింత జాగ్రత్తగా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనిచేయాలన్నారు. కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ మాట్లాడుతూ వార్డు ప్రణాళికా కార్యదర్శులు ఇప్పటికే రెండేళ్లకుపైగా విధి నిర్వహణలో అనుభవం సాధించినందున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్దేశించిన పనులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఏసీబీ రామకష్ణుడు, పుంగనూరు పురపాలక కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, నగరి కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, కుప్పం కమిషనర్‌ రవిరెడ్డి, పుంగనూరు టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ శుభప్రభ, ప్రణాళికశాఖ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.